Site icon vidhaatha

అన్నోజిగూడ బౌద్ధ విహారంపై భూకబ్జాదారుల దాడి

విధాత‌: టీఆర్‌ఎస్‌ స్థానిక రాజకీయ నాయకులు, భూకబ్జాదారులు, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై కొన్ని దశాబ్దాలుగా అన్నోజిగూడలోని బౌద్ధ విహారం అధీనంలో ఉన్న బౌద్ధవిహార స్థలాన్ని అర్ధరాత్రి ఘట్‌కేసర్‌ పోలీసుల అండతో దాడి చేసి బీభత్సం సృష్టించారు.

పోలీసుల సమక్షంలోనే దాడి

ఇదేమని ప్రశ్నించిన స్థానిక బౌద్ధ అభిమానులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడి ఘట్‌కేసర్‌ పోలీసుల సమక్షంలోనే జరిగింది. స్థానిక బౌద్దులు, బౌద్ధాభిమానులైన కాంబ్లే శంకర్, సంకాంబ్లీ భాలాజీ, మోడెకె భీమా, కడమ్ రాజు, లవాడే షంభాలపై అక్రమంగా సెక్షన్లు 447,427 read with 34 of IPC & Section 3 of PDPP Act కింద తప్పుడు కేసు (Crime No. 181/2023 Ghatkesar PS)పెట్టారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా పోలీసులు స్థానిక భూ కబ్జాదారుల కుమ్మక్కు ఫలితంగా రిమాండ్ చేయడానికి యత్నించారు.

బెయిల్ మంజూరు, విడుదల…

పోలీసుల ప్రయత్నాలను ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA) రాష్ట్ర అధ్యక్షుడు విజయ దేవరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనంత ఆంజనేయులు, గాంగేయుడు, తిరుపతి, యాదయ్య తదితర న్యాయవాదులు ఉదయం నుంచి ఫాలో అప్ చేసి తిప్పికొట్టారు. వెంటనే వారందరికీ బెయిల్ మంజూరై, విడుదల అయ్యేలా చూశారు. ఇక ముందు ILPA బాధితుల చట్టపరమైన హక్కుల పరిరక్షణకు అండగా నిలుస్తామని తెలిపారు.

పోలీసుల చర్యలను ఖండించిన ILPA

బౌద్ద విహార భూమిని అక్రమంగా కబ్జాపట్టే భూకబ్జాదారుల చట్ట విరుద్ధ చర్యలను, వారికి చట్ట విరుద్ధంగా సహకరిస్తూ తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్న స్థానిక పోలీసుల చర్యలను ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిపై పై అధికారులు తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Exit mobile version