- అన్యాక్రాంతం అయినట్లు ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు
- సెస్ అక్రమాల పై ప్రభుత్వం సీరియస్.
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామం
- మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | విధాత బ్యూరో, కరీంనగర్: జిల్లాలో భూఅక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల ప్రగతి పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖిమ్యా నాయక్, జిల్లా ఫారెస్ట్ అధికారి బాలమని తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 కు ముందు ప్రభుత్వ రికార్డుల్లో ఉండి.. తర్వాత అన్యాక్రాంతం అయిన భూముల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను భూబకాసురుల కబంధ హస్తాల నుంచి విడిపించి తిరిగి స్వాధీనం చేసుకోవాలనీ జిల్లా యంత్రాంగానికి విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న స్థలాలను విద్యా సంస్థల నిర్మాణాలు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలన్నారు.
జిల్లాలో బిడ్డ పెళ్లి కోసమో, తమ బిడ్డల ఉన్నత చదువుల కోసమో ముందు చూపుతో పైసా, పైసా కూడ బెట్టి కొనుగోలు చేసిన ప్లాట్ లను సైతం రాజకీయ పలుకుబడి, అధికారుల అండ, కండ బలంతో కబ్జాకొరులు కైంకర్యం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. తమ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే ప్రజలు తగు ఆధారాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలనీ మంత్రి చెప్పారు. మీడియా దృష్టికి తేవాలన్నారు. భూ ఆక్రమణదారుల కోరలుపీకి కబ్జాదారుల ఆధీనంలోని భూములను విడిపించి, నిజ యజమానులకు వాటిని అప్పగిస్తామనిచెప్పారు. భూ కబ్జాదారుల పై కూడా కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.
సెస్ లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. సెస్ లో అలసత్వం, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉపేక్షించేదిలేదన్నారు. సెస్ లో జరిగిన అక్రమాల గురించి ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే కలెక్టర్, ఎస్పీ దృష్టికి ఆధారాలతో తీసుకువస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.