విధాత : దీపావళి అంటేనే శుభాలను కాంక్షిస్తూ గృహాలు, కార్యాలయాల్లో నిర్వహించుకునే దివ్వెల పండుగ. ఈ పండుగ లక్ష్మిపూజకు..బాణసంచా వెలుగులుకు ప్రసిద్ది. అలాంటి సంబరాల దీపావళిని ఎవరైన తమ ఇండ్లు, కార్యాలయాల్లో వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. ఇదంతా రోటిన్ అనుకున్నారేమోగాని..ఆ ఊరి ప్రజలు మాత్రం వైరటీగా స్మశానంలో దీపావళి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తూ అందరిని విస్మయపరుస్తున్నారు. కరీంనగర్ లోని కార్ఖానా గడ్డ ప్రజలు సమాజానికి భిన్నంగా దీపావళి పండుగను స్మశానంలో నిర్వహించుకోవడం వైరల్ గా మారింది.
ఇక్కడ నివసిస్తున్న కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటూ సమాధుల వద్ద పూజలు నిర్వహించి..దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి దీపావళి జరుపుకుని తమ ఆచారాన్ని కొనసాగించారు. వారు ఆ విచిత్రమైన ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తుండటం విశేషం. దీపావళికి ముందే వారు తమ పెద్దల సమాధులను శుభ్రం చేసి..పూలతో అలంకరించి పండుగ వేళ కుటుంబాలతో కలిసి అక్కడే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. స్మశానంలో వారి దీపావళి వేడుకులకు మున్సిపల్ యంత్రాంగం, పోలీస్ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.