Land Grabbers Rampalli Village | ఎన్ఆర్ఐ మ‌హిళకు చెందిన భూమి.. దర్జాగా క‌బ్జా! మంత్రి అండతోనే?

తాము ఎప్పుడో 1999లో కొనుగోలు చేసిన భూమిని కొందరు వ్యక్తులు బలవంతంగా కబ్జా చేస్తున్నారని ఎన్నారై మహిళ ఒకరు ఆరోపించారు. అయితే.. ఈ విషయంలో మంత్రి పొంగులేటితోపాటు తనపై బీఆరెస్‌ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Publish Date - September 22, 2025 / 09:18 PM IST

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్‌ 22 (విధాత‌):

Land Grabbers Rampalli Village | మ‌హాన‌గ‌రంలో భూ క‌బ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా క‌నిపించే ఖ‌రీదైన భూముల‌ను ఇట్టే క‌బ్జా పెడుతున్నారు. కీలక నేతల అందడండలు ఉండటంతోనే యథేచ్ఛగా కబ్జాలు సాగిపోతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా.. కీస‌ర మండంలోని రాంప‌ల్లి రెవెన్యూ గ్రామంలో మెయిన్ రోడ్‌పై ఉన్న రూ.50 కోట్ల విలువ చేసే భూమిపై కబ్జాకోరుల కన్నుపడింది. దీన్ని అడ్డుకున్న బాధితులపైనే ఉల్టా కేసు పెట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

1999లో కొన్న భూమి!

ఎన్ఆర్ఐ ర‌జితారెడ్డి 26 ఏళ్ల క్రితం 1999లో రాంప‌ల్లి మెయిన్ రోడ్‌కు ఆనుకుని ఉన్న స‌ర్వే నంబ‌ర్ 385లో ఎకరం భూమిని న‌గేశ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. 2006లో పార్టీష‌న్ డీడ్ చేయించుకున్నారు. 2016లో నాలా క‌న్వ‌ర్షన్‌ చేసుకొని ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నారు. 2019లో ఎమ్మార్వో ద్వారా స‌ర్వే చేయించుకొని బౌండ‌రీ ఫిక్స్ చేయించుకొని కాంపౌండ్ వాల్ క‌ట్టుకున్నారు. 2002 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ క్లియ‌ర్‌గా ఉన్న‌ది. చిన్న ఇల్లు నిర్మించి, ఒక వాచ్‌మెన్‌ను నియమించుకున్నారు. ఈ భూమిపై క‌న్నేసిన సుబ్బారెడ్డి అనే క‌బ్జాదారు.. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మ‌రో స‌ర్వే నంబ‌ర్ వేసి, ఈ భూమి తనదేనని వాదిస్తూ క‌బ్జా చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. 2019 నుంచి ర‌జితారెడ్డి ఆధీనంలోని భూమిలో ఉన్న కాంపౌండ్ వాల్ గేటుకు సుబ్బారెడ్డి అని తనపేరును రాత్రిపూట రాయిస్తున్నాడు. దీనిపై ర‌జితారెడ్డి పోలీసుకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఫిర్యాదును ప‌ట్టించుకోకుండా వ‌దిలేశారని రజితా రెడ్డి చెబుతున్నారు. తాజాగా క‌బ్జాదారు సుబ్బారెడ్డి దాదాపు 20 మంది గుండాల‌తో ఎన్ఆర్ఐ మ‌హిళ ర‌జితారెడ్డికి చెందిన ఈ భూమి మీదకు వచ్చారు. కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి, సీసీ కెమెరాల‌ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రూమ్‌ల‌ను కూడా నేలమట్టం చేశారు. తమకు చెందిన భూమిని స్వాధీనంలోకి తీసుకోవ‌డానికి సుబ్బారెడ్డి అరాచ‌కం సృష్టించాడని బాధితులు వాపోయారు. ఈ భూమిని సుబ్బారెడ్డి క‌బ్జా చేశార‌ని మ‌హిళ‌లు ఫిర్యాదు చేస్తే పోలీసులు క‌బ్జాదారుల‌కు అనుకూలంగా మారి ఉల్టా బాధిత ఎన్ఆర్ఐ మ‌హిళ‌పైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి త‌మ‌పైనే కేసు పెట్టార‌ని బాధిత మ‌హిళ ర‌జితారెడ్డి మీడియా ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పాత యజమాని చెప్పినా పట్టించుకోని పోలీసులు

భూ క‌బ్జాదారు సుబ్బారెడ్డి 2016లో తాను న‌గేశ్ వ‌ద్ద‌ భూమిని కొనుగోలు చేశాన‌ంటూ చూపుతున్న డాక్యుమెంట్‌ నకిలీదని నగేశ్‌ కుమారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని రజితారెడ్డితో కలిసి నగేశ్‌ సైతం మీడియాకు వివరించారు. తాను ఎలాంటి భూమిని సుబ్బారెడ్డికి విక్రయించలేదని స్పష్టంచేశారు. తన భూమి పాత యజమాని సైతం సుబ్బారెడ్డికి భూమి అమ్మలేదని చెబుతున్నా.. పోలీసులు కబ్జాదారుడికే సపోర్టు చేస్తున్నారని రజితారెడ్డి వాపోయారు.

కబ్జా వెనుక పొంగులేటి ఇతరులు?

సుమారు 50 కోట్ల విలువ చేస్తుందని చెబుతున్న ఈ ఎకరం భూమిని సుబ్బారెడ్డి కబ్జా చేయడం వెనుక రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, స్థానికుడైన యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి హస్తం ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో పెద్దవాళ్ల హస్తం ఉందంటూ ఏకంగా రాచకొండ సీపీ సైతం దాటవేశారని ప్రచారం జరుగుతున్నది. రక్షణ కల్పించని పోలీసులు.. కాంప్రమైజ్‌ కావాలంటూ బాధితులకు ఉచిత సలహా ఇస్తున్నట్టు తెలుస్తున్నది.

క‌బ్జాదారుల నుంచి నా భూమిని కాపాడండి : సీఎంకు ర‌జితారెడ్డి వినతి

సుబ్బారెడ్డి అనే వ్య‌క్తి 20 మంది గుండాల‌తో వ‌చ్చి తన భూమిని కబ్జా చేశాడని ఎన్నారై మహిళ రజితా రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భూమిని క‌బ్జా చేశాడు. కాంపౌడ్ వాల్‌ కూల్చి వేశాడు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు. రూమ్‌లు కూల్చివేశాడు. ఇత‌నికే పోలీసులు, రెవెన్యూ అధికారులు వ‌త్తాసు ప‌లుకుతున్నారు. నా భూమిని సుబ్బారెడ్డి క‌బ్జా చేశాడ‌ని ఫిర్యాదు చేస్తే పోలీసులే నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేను 1999లో నగేశ్‌ అనే భూ య‌జమాని నుంచి కొనుగోలు చేశాను. నాటి నుంచి భూమి నా అనుభ‌వంలోనే ఉన్న‌ది. 2006లో పార్టీష‌న్ చేసుకున్నా. 2016లో నాలా క‌న్వ‌ర్ష‌న్ చేసుకున్నా. ఎల్ఆర్ఎస్ తీసుకున్నా. 2019లో ఎమ్మార్వోతో స‌ర్వే చేయించుకొని, మ్యాపింగ్ చేయించాను. చుట్టూ కాంపౌండ్ వాల్ క‌ట్టుకున్నాను. ఇప్ప‌డు నా కాంపౌండ్ వాల్‌ను కూల్చి వేసి క‌బ్జా చేశాడు. ఈ భూమిని క‌బ్జా చేయ‌డానికి మ‌రో స‌ర్వే నంబ‌ర్ ద్వారా భూమిని కొనుగోలు చేస్తుకున్న‌ట్లు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు. ఫేక్ డాక్యుమెంట్ దారుడికే పోలీసులు, రెవెన్యూ అధికారులు స‌పోర్ట్ చేస్తున్నారు. నేను ఎన్ఆర్ఐ మ‌హిళ‌ను.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు.. మీరైనా జోక్యం చేసుకొని క‌బ్జాదారుల నుంచి భూమిని కాపాడండి’ అని విజ్ఞప్తి చేశారు.

మంత్రి పొంగులేటిపై తప్పుడు వార్తలు: డీసీపీకి శివచరణ్ రెడ్డి ఫిర్యాదు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఒక భూమి సమస్యకు సంబంధించి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆరోపించారు. కీసరలో భూ సమస్యకు తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని మండి పడ్డారు. ఇలాంటి నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్బీ నగర్ డీసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు శివచరణ్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Pm Modi Open Letter To Nation On GST | జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు లాభం: మోడీ బహిరంగ లేఖ
Ethipothala Falls | మహా అందం..మాచర్ల జలపాతం..పెరిగిన పర్యాటకుల తాకిడి
Kavitha Fires On Hydra Demolition | పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? : హైడ్రాపై కవిత మండిపాటు