AP 10th Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారని, పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయన్నారు.
ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని సూచించారు. జీవితం రెండవ అవకాశాన్ని అందిస్తుందని గుర్తు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి 28 వరకు జరుగుతాయన్నారు. ఇది విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ద్వారా ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో పొందవచ్చు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా టెన్త్ ఫలితాలతో పాటే విడుదల చేశారు.
చరిత్ర సృష్టించిన కాకినాడ విద్యార్థిని..600/600మార్కులు
ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థిని చరిత్ర సృష్టించింది. యల్ల నేహాంజని పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.నేహాంజని కాకినాడలో భాష్యం స్కూల్ విద్యార్థిని. ఓ విద్యార్థి 600/600మార్కులు మార్కులు సాధించడం ఇదే తొలిసారి అధికారులు చెబుతున్నారు.