విధాత : ఏపీ రాజధానిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ కుండబద్దలు కొట్టింది. విజభన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా ఏర్పాటు అయ్యిందని స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ల కింద నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించిందని.. ఆ కమిటీ రిపోర్టును కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి పంపిందని మంరి తెలిపారు. తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేసిందని.. 2015లోనే నోటిఫై చేసిందని తన సమాధానంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం బిల్లులు తెచ్చిందని తెలిపారు.
పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేశారని, కానీ, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ చట్టాలను చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అంశం కోర్టుల పరిధిలో ఉందన్నారు.