Amaravati Construction Delay | హైదరాబాద్, ఆగస్ట్ 15 (విధాత): ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని నీళ్ల నీడలు కమ్ముతున్నాయి. కృష్ణా నదికి పక్కనే నిర్మిస్తున్న అమరావతిని రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఆ మేరకు పనులు ప్రారంభం అయ్యాయి కానీ.. వర్షాలతో ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమరావతి ఐకానిక్ టవర్ల పునాదుల్లోకి వరద నీరు చేరింది. ఇతర నిర్మాణ ప్రాంతాల్లో కూడా వర్షం నీరు చేరింది. ఈ నీటిని తోడే పనులు చేపట్టారు అధికారులు. రాజధాని నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో వరద నీటి పరిస్థితిని సీఆర్‌డీఏ అధికారులు పరిశీలించారు. ఏఏ ప్రాంతాలు నీటిలో ఉన్నాయి, వర్షం వస్తున్నా నిర్మాణ పనులు ఎక్కడ చేయవచ్చు.. వరద నీటిని ఎక్కడెక్కడ తోడాల్సిన పరిస్థితులున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. దీని ఆధారంగా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వరద నీటిని తోడిన తర్వాత బురదను తొలగించాల్సి ఉంటుంది. అప్పుడే నిర్మాణ పనులకు ఇబ్బందులుండవు. రాజధాని నిర్మాణ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే వర్షంతో ఏర్పడిన బురద, వరద నీటి తొలగింపు, మరో వైపు వరదతో ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే జరిగిన నష్టానికి సంబంధించి కాంట్రాక్టును పెంచాలని కాంట్రాక్టర్లు కోరే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా సాగుతోంది.
అమరావతికి వరద ముప్పు ఉందా?
కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల డ్యామ్‌లతో వరదలను నియంత్రిస్తాయని ప్రపంచబ్యాంకు ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ రిపోర్టు 2019లో అభిప్రాయపడింది. అమరావతి ఫ్లడ్ ప్లేస్‌లో లేదని చెబుతూనే వాగులు పొంగడం వల్ల రిస్క్ ఉంటుందని తెలిపింది. దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవసరమని సూచించింది. కృష్ణా నది, వాగుల ప్రభావం వల్ల రిస్క్ ఉందని ఫ్లడ్ హజార్డ్ మ్యాపింగ్ 2025 రిపోర్ట్ సూచిస్తోంది. ఇలా పలు రిపోర్టులు స్థానికంగా ఉన్న వాగులతో వరదల ముప్పును సూచించాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయాలను కూడా తెలిపాయి. చిన్న చిన్న రిజర్వాయర్లు లేదా చెరువుల నిర్మాణాల ద్వారా ఈ వరదను నియంత్రించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఇందులో భాగంగానే నీరుకొండ, శాఖమూరు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, లాం, వైకుంఠపురంలలో రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఒక్కో క్క రిజర్వాయర్ సామర్థ్యం 1 టీఎంసీ కంటే ఎక్కువగా ఉంటుంది. వీటిలో కొన్ని పనులకు టెండర్లు పిలిచారు. కొండవీటివాగు, పాలవాగు నుంచి వచ్చే వరద నీటిని ఈ రిజర్వాయర్లలోకి మళ్లిస్తారు. ఆ తర్వాత కష్ణానదిలో ఈ నీటిని విడుదల చేయాలనేది ప్లాన్. ఇందుకోసం 46 కి.మీ కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. దీని ద్వారా అమరావతికి వరదముప్పును తప్పించవచ్చనేది సర్కార్ ప్లాన్.