Margadarsi | దూకుడు పెంచిన CID.. వెబ్‌సైట్ మూసేసిన మార్గదర్శి!

Margadarsi | విధాత: అనుకోకుండా జరిగిందో ..లేక కావాలని మూసేశారో తెలియదు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ వెబ్ సైట్ మూసేసింది. ఆ సైట్లో ఎప్పుడు చూసినా ప్రోమోలు.. ఎడ్వర్టైజ్ మెంట్లు.. చిట్ గ్రూపుల వివరాలు.. డివిడెండ్ ఇలా చాలా సమాచారం ఉండేది.. కానీ శుక్రవారం నుంచి ఆ వెబ్ సైట్ పని చేయడం లేదు.  మరోవైపు ఆంధ్ర సీఐడీ వాళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చేస్తున్న వ్యాపారాన్ని కార్పొరేట్ ఫ్రాడ్ అని పేర్కొంటూ […]

  • Publish Date - July 29, 2023 / 03:16 AM IST

Margadarsi |

విధాత: అనుకోకుండా జరిగిందో ..లేక కావాలని మూసేశారో తెలియదు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ వెబ్ సైట్ మూసేసింది. ఆ సైట్లో ఎప్పుడు చూసినా ప్రోమోలు.. ఎడ్వర్టైజ్ మెంట్లు.. చిట్ గ్రూపుల వివరాలు.. డివిడెండ్ ఇలా చాలా సమాచారం ఉండేది.. కానీ శుక్రవారం నుంచి ఆ వెబ్ సైట్ పని చేయడం లేదు. మరోవైపు ఆంధ్ర సీఐడీ వాళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చేస్తున్న వ్యాపారాన్ని కార్పొరేట్ ఫ్రాడ్ అని పేర్కొంటూ మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

ఈ మేరకు సీఐడీ ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు.

“మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్‌ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్‌ మీడియా లిమిటెడ్‌, ఉషోదయ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులు అటాచ్‌ చేస్తూ హౌం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్‌ నంబర్‌ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్‌ చేశాం. కోర్డులోనూ అటాచ్‌ మెంట్‌ పిటీషన్‌ దాఖలు చేశాం. రెండు క్రిమినల్‌ కేసులలో 15 మందిపై చార్జిషీట్‌ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్‌ తదితరులపై చార్జి షీట్‌ నమోదైంది” అని సీఐడీ ఎస్పీ పేర్కొన్నారు.

“మోసం, డిపాజిట్లు మళ్లించడంపై చిట్‌ ఫండ్‌ యాక్ట్‌గా కేసులు నమోదు చేశాం. మిగిలిన ఐదు కేసులలో విచారణ చివరి దశకి వచ్చింది. త్వరలోనే ఆ కేసుల్లోనూ ఛార్జి షీట్‌ నమోదు చేస్తాం. మార్గదర్శి చిట్‌ఫండ్‌ డిపాజిట్‌ దారులను మోసం చేసి నిధులు మళ్లించారు. డిపాజిట్‌ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా కాగితాలు చదవాలి. డిపాజిట్‌ దారులు మోసపోకుండా మీడియా కూడా అవగాహన కలిగించాలి. ఇది కార్పొరేట్‌ ఫ్రాడ్‌” అని సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు.

ఈ ప్రెస్మీట్ ముగిసిన సాయంత్రం నుంచి వెబ్సైట్ ఆగిపోయింది. ప్రస్తుతం మెయింటనెన్స్ చేస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఐడీ దెబ్బతోనే మొత్తం సైట్ ఆపేశారు అని, అందులోని వివరాలు బయటకు తెలియకుండా ముందు జాగ్రత్తగా ఇలా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది.

Latest News