జర్మనీలో అర్ధరాత్రి వేళ ఆకాశంలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఒక చిన్న సైజు గ్రహశకలం (Asteroid) మండిపోతూ కింద పడిపోయింది. తూర్పు జర్మనీ (Germany) లో జరిగిన ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీయగా అవి వైరల్‌గా మారాయి. చిమ్మ చీకట్లో నిప్పులు చిమ్ముకుంటూ ఆస్టరాయిడ్ పడుతున్న తీరు అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తొలుత కొందరు ఇది యూఎఫ్ఓ అని.. కూలిపోతున్న విమానం అని భావించినప్పటికీ.. అది ఒక గతితప్పిన గ్రహశకలమని శాస్త్రవేత్తలు తర్వాత ప్రకటించారు.
అంతరిక్ష పరిశోధకులు, ఔత్సాహికుల కథనం ప్రకారం.. 2024 బీఎక్స్1 అనే ఈ ఆస్టరాయిడ్.. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు దగ్గర్లోని నెన్‌హాసెన్ వద్ద వాతావరణంలోకి ప్రవేశించింది. హంగేరీకి చెందిన ఆస్ట్రనామర్ క్రిస్టియన్ హార్నెక్‌జీ ఈ ఆస్టరాయిడ్‌ను భూమి మీదకు వస్తుండగా మొట్టమొదటిగా గుర్తించారని తెలుస్తోంది. ఆస్టరాయిడ్ భూమిని తాకడానికి 20 నిమిషాల ముందు నాసా కూడా ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించింది. ఆకాశంలోకి చూడండి. గతి తప్పిన ఒక చిన్న ఆస్టరాయిడ్ శకలం.. భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. దీని వల్ల ఎలాంటి హానీ లేదు.
జర్మనీ తూర్పు ప్రాంతంలో ఉన్న వారు దీనిని నిరభ్యంతరంగా చూడొచ్చే అని ప్రకటనలో పేర్కొంది. జర్మనీలో పడిన ఈ ఆస్టరాయిడ్.. ఒక మీటరు పరిమాణంలో ఉంటుదని శాస్త్రవేత్తల అంచనా. ప్రపంచ ఆస్టరాయిడ్ ప్రాజెక్టు ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన డెనిస్ విడా ఈ మేరకు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా శక్తివంతమైన కెమేరాలను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసి.. ఆస్టరాయిడ్‌ల రాకను నిశితంగా పరిశీలించడం వీలవుతుంది. అలా జర్ననీలో ఏర్పాటు చేసిన లైవ్ కెమేరాలో ఈ ఆస్టరాయిడ్ భూమిపై పడటం కూడా కనిపించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించగానే.. ఏర్పడే ఘర్షణ వల్ల అది కాలిపోయి తునాతునకలుగా మారిపోతుంది.