Snow Fog | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్ కశ్మీర్‌ను తలపిస్తోంది. నగర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గినప్పటికీ.. పొగమంచు మాత్రం దట్టంగా కురుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ పొగమంచు కురియడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలకు కూడా పొగమంచు దట్టంగా కమ్మేసింది.
కనుచూపు మేరలో కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంటే అంతలా మంచు కురుస్తోంది. తమకు కనుచూపు మేరలో ఉన్న వారిని కూడా గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానికులు. వాహనదారులు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. విజయవాడ – హైదరాబాద్ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఈ వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ స్థానికులు మాత్రం కొత్త అనుభూతిని పొందుతున్నారు. తాము హైదరాబాద్ నగర శివార్లలో ఉన్నామా..? లేదా కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో ఉన్నామా..? అనే భావనలో ఉండిపోయారు. పొద్దుపొద్దున్నే దట్టమైన పొగమంచుకు థ్రిల్ అవుతూ.. ఆ వాతావరణాన్ని, పొగమంచును తమ కెమెరాల్లో బంధిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.]
