T20 CWC: IND vs NED | పసికూనపై ముక్కీమూలిగి గెలిచిన ఇండియా – ఏమాత్రం వెరవని డచ్​ వీరులు

నెదర్లాండ్స్‌పై 193 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో గెలిచినా భారత్ ఆటతీరు పూర్తిగా నమ్మకం కలిగించలేదు. టాప్ ఆర్డర్ వైఫల్యం, బౌలింగ్ లో ఒత్తిడి స్పష్టంగా బయటపడగా, శివం దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనే జట్టును గట్టెక్కించింది. లీగ్‌ను అజేయంగా ముగించిన ఇండియా, ఇప్పుడు సూపర్–8లో దక్షిణాఫ్రికాతో అసలైన అగ్నిపరీక్షకు సిద్ధమవుతోంది.

Shivam Dube half century and all round show against Netherlands T20 World Cup

India Edge Past Netherlands, But Cracks Show Before Super 8 Battle

సూపర్–8కు ముందు హెచ్చరిక

నెదర్లాండ్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచినా భారత్ ఆటతీరు పూర్తిగా నమ్మకం కలిగించలేదు. టాప్ ఆర్డర్ వైఫల్యం, బౌలింగ్‌లో ఒత్తిడి స్పష్టంగా బయటపడగా, శివం దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనే జట్టును గట్టెక్కించింది. 22న దక్షిణాఫ్రికాతో సూపర్–8 తొలి పోరు అసలైన అగ్నిపరీక్షగా మారనుంది.

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

T20 CWC: IND vs NED | టి20 ప్రపంచకప్ లీగ్ దశను భారత్ అజేయంగా ముగించినప్పటికీ, నెదర్లాండ్స్‌పై సాధించిన విజయం మాత్రం అనుకున్నంత సునాయాసం కాలేదు. 194 పరుగుల లక్ష్యాన్ని డచ్ జట్టు చివరి వరకు వెంటాడటం భారత జట్టుకు గట్టి హెచ్చరికగా మారింది. సూపర్–8లో గట్టి ప్రత్యర్థులు ఎదురుచూస్తున్న వేళ, ఈ మ్యాచ్ భారత్ ఆటతీరుపై అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.

టి20 ప్రపంచకప్​ లీగ్​ పోటీల్లో భాగంగా అహ్మదాబాద్​లో జరిగిన ఆఖరి మ్యాచ్​లో భారత్​ నెదర్లాండ్స్​పై తడబడుతూ గెలిచింది. టాస్​ గెలిచి ముందుగా బ్యాటింగ్​ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేయగా, ప్రతిగా డచ్​ టీమ్​ 20 ఓవర్లకు 176 పరుగులు సాధించి విజయానికి కొద్దిదూరంలో నిలిచిపోయింది. దీంతో ఆడిన నాలుగు లీగ్​ మ్యాచ్​లలో విజయం సాధించిన జట్టుగా ఇక సూపర్​ 8 ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది.

నిర్భీతిగా బ్యాట్లు ఝుళిపించిన డచ్​ వీరులు

భారత్​ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్​కు దిగిన నెదర్లాండ్స్​ బ్యాటర్లు ఏ దశలోనూ భారత బౌలింగ్​కు భయపడకుండా ఆడారు. అప్పుడప్పుడు వికెట్లు పడుతున్నా, ​ పరుగుల వేగాన్నిమాత్రం నిలబెట్టారు. వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​కు వచ్చేంతవరకు ఒక్క వికెట్​ పడకుండా కాపాడుకున్న నెదర్లాండ్స్​ బ్యాటర్లు, ఒక్కొక్కరుగా వెనుదిరిగినా, లక్ష్యాన్ని మాత్రం అందుబాటులోనే ఉంచుకున్నారు. అయితే, వరుణ్​ బౌలింగ్​తో వారి పోరాటం బీటలువారింది. భారీ లక్ష్యాన్ని కరిగించడంలో శాయశక్తులా కృషి చేసి దగ్గరకు చేరుకున్నా, ఓటమి తప్పలేదు. కానీ, వారి పోరాటపటిమ మాత్రం భారత జట్టుకు అగ్నిపరీక్షలా నిలిచింది. ఒక్క ఆర్యన్​ దత్​ తప్ప అందరూ తలా 20లు, 30లు చేసారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో డచ్​ జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి, విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది.

భారత బ్యాటింగ్​లో ఒడిదుడుకులు – భయపెట్టిన డచ్​ బౌలర్లు

సూపర్​ 8 పోటీలకు ముందు బ్యాటింగ్​ ప్రాక్టీస్​ చేద్దామనుకుని టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ ఆటలు నెదర్లాండ్స్​ ముందు ఏమాత్రం సాగలేదు. గత రెండు మ్యాచుల్లోనూ సున్నాకే వెనుదిరిగిన డ్యాషింగ్​ ఓపెనర్​ అభిషేక్​ శర్మ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మరోసారి డకౌట్​ అయ్యాడు. ఆడిన అన్ని(3) లీగ్​ మ్యాచులలోనూ సున్నాకే ఔటైన అభిషేక్​ వెరైటీ రికార్డు సాధించాడు.

సూపర్​ ఫామ్​లో ఉన్న మరో ఓపెనర్​ ఇషాన్​ కిషన్​తో జత కలిసిన తిలక్​ వర్మ కాసేపు బౌలర్లను నిలువరించగలిగాడు. కానీ, ఒక దురదృష్టకర బంతికి ఇషాన్(18)​ ఇంటిముఖం పట్టడంతో వచ్చిన కెప్టెన్​ సూర్య కలిసి మరికొన్ని పరుగులు జతచేసిన తిలక్​(31) జట్టు స్కోరు 69 వద్ద పెవిలియన్​ బాట పట్టాడు. అప్పుడు క్రీజ్​లోకి చేరిన శివం దూబే, కెప్టెన్​తో కలిసి పరుగుల వరద పారించాడు. కాసేపటికి సూర్య(34) అవుటైనా, వచ్చిన హార్థిక్​పాండ్యా, దూబే కలిసి చివర్లో వీర విహారం చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమవుతుందనుకున్న జట్టును 193 పరుగులకు చేర్చారు. దూబే(66 పరుగులు: 6 సిక్స్​లు, 4 ఫోర్లు) అర్థసెంచరీనే లేకుంటే పరిస్థితి చాలా అవమానకరంగా ఉండేది.  చివరి బంతికి పాండ్యా(30 పరుగులు: 3 సిక్స్​లు) కూడా అవుటయ్యాడు. కాగా, అర్థశతకంతో పాటు, రెండు వికెట్లు కూడా తీసుకున్న శివం దూబే ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు.

సూపర్​–8 పోటీలకు ఇక సన్నద్ధం

భారత్​ గెలిచిన నాలుగు లీగ్​ పోటీల్లో రెండు మ్యాచ్​లు పసికూనలైన అమెరికా, నెదర్లాండ్స్​ జట్లపై అతికష్టంపై గెలిచినవే. నమీబియా, పాకిస్థాన్​లపై మాత్రమే భారత్​ ఆటతీరు సాధికారికంగా ఉంది. కాగా, ఈనెల 22 నుండి భారత్​ సూపర్​ 8 పోరు ప్రారంభం కానుంది. ఆరోజు భీకర ఫామ్​లో ఉన్న దక్షిణాఫ్రికాతో ఇదే నమో స్టేడియంలోనే ఢీకొట్టనున్న ఇండియా ఇదే ఆటతీరు కొనసాగిస్తే మాత్రం కష్టమే. ఆ తర్వాత సంచలన ఆటతీరుతో రాణిస్తూ ఏకంగా సూపర్​ 8లోకి అడుగుపెట్టిన జింబాబ్వేతో పోటీ. తనదైన రోజున ఎటువంటి ప్రత్యర్థినైనా నిలువరించగలదు. ఇక మిగిలింది వెస్టిండీస్​. అసలే టి20 మ్యాచ్​లంటేనే చెలరేగే విండీస్​ బ్యాటర్లను కట్టడి చేయకపోతే, పరిస్థితి వెంటనే చేజారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్​ తన ఆటతీరును, బ్యాటర్లు తమ నైపుణ్యాలను పున:సమీక్షించుకోవాల్సిఉంది.

Latest News