Kidney Health | చలి( Cold ) చంపేస్తోంది. ఎముకలు కొరికే చలికి పసికందు నుంచి పండు ముసలి వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో నుంచి అడుగు బయట వేసేందుకు భయపడుతున్నారు. ఇక చలిగా ఉందని చెప్పి మంచినీళ్ల( Drinking Water ) వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇలా చలికి భయపడి నీళ్లు తాగకపోతే మూత్రపిండాలకు( Kidney ) ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. కాబట్టి చలికాలం( Winter )లోనూ శరీరానికి కావాల్సినంత నీళ్లు తాగి.. మూత్రపిండాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
మూత్రపిండాల విధి ఏంటంటే..?
శరీరంలోని చెడు పదార్థాలను, మలినాలను ఫిల్టర్ చేయడంలో మూత్రపిండాలు కీలకంగా పని చేస్తాయి. అదనపు ద్రవాలను తొలగించి మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యం విషయంలో ఏ కాలంలోనూ పొరపాట్లు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో నీళ్లు తాగకపోతే ఏమవుతుంది..?
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉందని చెప్పి.. చాలా మంది నీటిని తాగేందుకు ఇష్టపడరు. రోజుకు ఒకట్రెండు గ్లాసుల నీటితో సరిపెట్టుకుంటారు. కానీ ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. నీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పని చేయవు. శరీరం కూడా డీహైడ్రేట్ అయిపోతోంది. కాబట్టి దాహం వేయకపోయినా.. ప్రతి రెండు గంటలకు ఒకసారైనా ఒకట్రెండు గ్లాసుల మంచినీళ్లు తాగడం ఉత్తమం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉండి.. మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.
గోరు వెచ్చని నీరు ఉత్తమం..!
వాతావరణం చల్లగా ఉందని భావిస్తే.. చల్లని నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీటిని తీసుకోవడంతో శరీరం కూడా కొంచెం వెచ్చగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. మూత్రపిండాల నుంచి హానికరమైన వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. చల్లని నీటితో పోలిస్తే.. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు కూడా మద్దతు ఇస్తుంది. రోజంతా శక్తిని అందిస్తుంది. మూత్రపిండాల పనితీరును రక్షించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.
శారీరక శ్రమ తప్పనిసరి..!
చలికి భయపడి చాలా మంది మంచానికే పరిమితం అవుతుంటారు. ఎండ కొట్టే వరకు కూడా దుప్పట్లోనే దూరి ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బద్దకంగా ఉంటే.. మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. చలికి భయపడకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. లేదంటే జీవక్రియను నెమ్మదించి.. శరీరం హానికరమైన పదార్థాలను బయటకు పంపకుండా చేస్తుంది. కాబట్టి రోజువారీ నడకలు, తేలికపాటి స్ట్రెచింగ్ లేదా సాధారణ వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
