Weather Report | రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించాయి. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత ప్రారంభమైంది. సాయంత్రానికి చల్లని గాలులు వీస్తూ.. రాత్రంతా చలిగానే ఉంటుంది. అయితే ఇదే పరిస్థితి మరో నాలుగైదు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలఖారు నుంచి ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని, పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
శనివారం నాడు ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఖమ్మంలో గరిష్ఠంగా 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మెదక్‌లో కనిష్ఠంగా 13.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హనుమకొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణంకంటే 1 నుంచి 2.5 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి.
నెలాఖరు నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి సాధారణ స్థితిలోనే ఉండగా… నెలాఖరు నుంచి వేగంగా మారే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో ఒకట్రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత రెండ్రోజులు తక్కువగా నమోదు కావడం గమనిస్తామని, ఆ తర్వాత క్రమంగా పెరుగుదల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు ఎక్కువ రోజులు ఉందని చెబుతున్నారు.
