Health Tips | వాతావరణంలో ఉష్ణోగ్రతలు( Temperatures ) కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చల్లని గాలులు( Cold Wave ) వీస్తున్నాయి. ఈ చల్లని గాలులు గుండె( Heart )కు ముప్పు అని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. ఈ శీతల గాలులు పిల్లల్లో న్యూమోనియా, పెద్దల్లో ఆస్తమాకు దారి తీస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అయితే చలి కాలంలో శరీరానికి తగినంత ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ డీ లోపం తలెత్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి క్షీణించే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. ఈ సమస్యల్ని ఎదుర్కోవాలంటే.. ఆహార నియమాలు పాటించాలని, వ్యాయామం తప్పనిసరి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చల్లని గాలులతో గుండె సమస్యలు అధికం..!
చల్లని గాలులు వీస్తున్న నేపథ్యంలో వీక్‌గా ఉన్న వారిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రక్తనాళాలు సంకోచించి అధిక రక్తపోటుకు దారి తీసే ప్రమాదం ఉంది. హైబీపీ వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి.. రక్తం కూడా గడ్డ కట్టే ఆస్కారం ఉంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో గుండెకు సరఫరా అయ్యే ప్రాణ వాయువు శాతం తగ్గడంతో గుండె పనితీరు మందగించనుంది. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతిని, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలున్న వారు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి ఎలాంటి ఆహారం మంచిది..?
అనారోగ్యకరమైన చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా వేడి ఆహారాన్ని, ముఖ్యంగా ఆకుకూరలను భోజనంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, పిండి వంటలను కట్టిడి చేయాలని పేర్కొంటున్నారు. వేడివేడి సూప్‌లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
చలి ఎక్కువగా ఉంటే వ్యాయామం ఇంటి లోపల చేయడం బెటర్. కాస్త ఎండ వచ్చాక నడక, ఇతర శారీరక శ్రమ కలిగించే ఎక్సర్సైజ్లు తప్పనిసరి చేయాలి. ఉన్ని దుస్తులతో చలి తగలకుండా వెచ్చగా ఉండడం అందరికీ మేలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
