Cucumber | కీర దోసకాయ( Cucumber ) ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ దోసకాయను సలాడ్ రూపంలో లేదా.. రైతా రూపంలో లేదా.. నేరుగా ఉప్పు కలుపుకుని తింటారు. ఇలా తినడంతో శరీరాన్ని డీ హైడ్రేషన్( Dehydration ) నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా దోసకాయలో విటమిన్ సి, ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఈ కీర దోసకాయ కొందరికి ఎంత మేలు చేస్తుందో.. మరికొందరికి అంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీర దోస వల్ల ఎవరెవరికి హానీకరమో ఈ కథనంలో తెలుసుకుందాం.
అసిడిటీ సమస్య ఉన్న వారు..
అసిడిటీ సమస్య లేదా బలహీనమైన జీర్ణ వ్యవస్థ కలిగి ఉన్న వారు కీర దోసకాయకు దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే దోసకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ పీచు కూడా అసిడిటీ సమస్యను అధికం చేస్తుంది. కాబట్టి వీరు కీర దోసకాయ తీసుకోకపోవడం మంచిది.
కఫంతో బాధపడేవారు..
కఫం, జలుబు లేదా గొంతు నొప్పితో బాధపడే వారు కూడా కీర దోసకాయను తినకపోవడమే మంచిది. దోసకాయకు చలువ చేసే గుణం ఎక్కువ కాబట్టి.. కఫం పెరిగే అవకాశం ఉంటుంది. జలుబు కూడా తగ్గకపోవచ్చు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు దోసకాయ తినకపోవడమే ఉత్తమం.
తరుచుగా మూత్ర విసర్జనతో బాధపడేవారు..
దోసకాయ సహజంగా మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన సమస్య ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుంది. అలాంటి వారు దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
లో బీపీతో బాధపడేవారు..
దోసకాయ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గించగలదు. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్య ఉంటే, దోసకాయ ఎక్కువగా తింటే మైకం, బలహీనత లేదా అలసట అనిపించవచ్చు. అందుకే తక్కువ రక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలోనే దోసకాయను తినాలి.
