Health Tips | ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్( Carrot ), బీట్ రూట్‌తో పాటు కీర దోసకాయను మెనూలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు( Health Experts ) సూచిస్తుంటారు. ఈ మూడింటిని ప్రతి రోజు తినడం వల్ల హెల్తీగా ఉంటారని చెబుతుంటారు. రోగనిరోధక శక్తి పెరిగి.. రోగాలు కూడా దరి చేరవని పేర్కొంటారు. అయితే షుగర్( Sugar )తో బాధపడే వారు క్యారెట్ తినొచ్చా..? అన్న సందేహం ఉంటుంది. ఎందుకంటే క్యారెట్ తియ్యగా ఉంటుంది కాబట్టి. మరి మధుమేహ రోగస్తులకు( Sugar Patients ) క్యారెట్ ఎంత వరకు మంచిదనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
క్యారెట్‌లో ముఖ్యంగా బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ ఏ, కే1, పొటాషియంతో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ అనేక రోగాల నుంచి కాపాడుతాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారి నుంచి కూడా క్యారెట్ కాపాడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరను కూడా కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు క్యారెట్ మంచిదని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
క్యారెట్‌తో షుగర్ కంట్రోల్..
క్యారెట్ తియ్యగా ఉంటుంది కాబట్టి.. షుగర్ బారిన పడ్డ వారికి మంచిది కాదని భావిస్తుంటారు. కానీ ఇది అసంబద్ధ వాదన అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్యారెట్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుంది. రక్తంలోని చక్కెరను కూడా క్యారెట్ సమతుల్యం చేస్తుంది. క్యారెట్‌లో ఉండే ఫైబర్ కూడా జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీంతో గ్లూకోజ్ శోషణ నెమ్మదిగా జరుగుతుంది. మొత్తానికి శరీరంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే క్యారెట్ వంటి కూరగాయలు తినడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
క్యారెట్ వల్ల ఇతర ప్రయోజనాలు ఇవే..
- క్యారెట్లలో ఉండే ఏ విటమిన్ కారణంగా.. కంటిచూపు మెరుగుపడుతుంది.
- క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
- వీటిలో ఉండే పొటాషియం, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. రక్తపోటు నియంత్రిస్తాయి. గుండె జబ్బులను దూరం చేస్తుంది.
- క్యారెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
- క్యారెట్లలో ఉండే విటమిన్ బీ6, కెరోటినాయిడ్లు మెదడును చురుకుగా చేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
ఇవి కూడా చదవండి :
Marriage | మీకు పెళ్లి కావడం లేదా..? ఈ 4 మొక్కలు పెంచితే పెళ్లి పీటలెక్కడం ఖాయం..!
Horoscope | సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
