Congress Infighting | దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనపడుతున్న క్రమంలో తాజాగా పార్టీలో మరోసారి బహిర్గతమైన అంతర్గత విబేధాల పర్వం పార్టీ కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. వందేళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చీలికలు.. తిరుగుబాట్లు కొత్తకాకపోయినా.. పార్టీ అగ్ర నాయకత్వంపై నమ్మకం సడలటం తిరుగుబాట్లకు ఊతమిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తరచూ ప్రధాని మోదీ భజన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. తాజాగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు సైతం పార్టీ అగ్రనాయకత్వంపై, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వం, హైకమాండ్ నిర్ణయాలపై బాహటంగా విమర్శలు గుప్పిస్తుండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు పార్టీ దుస్థితిని చాటుతున్నాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో కేరళలో మాత్రమే కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో సీఎం పీఠం కోసం సీఎం సిద్ధరామయ్య, డీకే శివశంకర్ మధ్య సాగుతున్న ప్రచ్చన్న యుద్దం టైమ్ బాంబ్ మాదిరిగా కాంగ్రెస్ హైకమాండ్‌ను భయపెడుతోంది. తెలంగాణలోనూ భవిష్యత్తులో ధిక్కర స్వరాలు పెరిగే చాన్స్ కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ లో మణిశంకర్ మాటల మంటలు
ఇటీవల మణిశంకర్ అయ్యర్ తిరువనంతపురంలో జరిగిన ‘విజన్ 2031-అభివృద్ధి, ప్రజాసామ్యం’ అనే సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సెమినార్‌కు హాజరుకావద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినా పట్టించుకోలేదు. తాను హాజరవడమే కాకుండా.. వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. మళ్లీ విజయన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ పార్టీకి కేరళలో మరోసారి ఓటమి ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌లోని కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, పవన్ ఖేరా ముగ్గురూ పనికిమాలిన నేతలని మండిపడ్డారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ఒక వీధి రౌడీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాను ‘కీలు బొమ్మ’, ‘చిలుక’ అని, శశి థూరూర్‌ను ‘పాకిస్తాన్ వ్యతిరేకి’గానూ, ‘తదుపరి విదేశాంగ మంత్రి’ కావాలనే ఆశ పడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్‌ను కూడా ఆయన ఎగతాళి చేస్తూ, “తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలని తంటాలు పడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వ్యతిరేక వ్యాఖ్యలతో కాక
తాను వంద శాతం గాంధేయవాదిని.. నెహ్రూ, రాజీవ్‌కు శిష్యుడినని చెప్పుకొన్న అయ్యర్.. కానీ.. తాను రాహుల్‌కు శిష్యుడిని కాదని, నిజానికి రాహుల్ తనకు నచ్చదని కూడా కుండ బద్దలు కొట్టారు. ఒకవేళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తనను బయటకు తరిమేస్తే తాను సంతోషంగా బయటకు వెళ్లి ఆయనను వెనుక నుంచి తంతానంటూ అయ్యర్ వ్యాఖ్యానించారు. గాంధీపై నెహ్రూ తిరుగుబాటు చేశారని, అయినప్పటికీ గాంధీ నెహ్రూను ప్రధానిగా ఎంపిక చేశారని అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. అయ్యర్ ఇండియా కూటమి నాయకత్వం నుంచి కాంగ్రెస్ తప్పుకోవాలని, ప్రతిపక్ష పార్టీలను జాతీయంగా ఏకం చేయగల సత్తా ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని వ్యాఖ్యానించారు.
ధిక్కారం.. మణిశంకర్ అయ్యర్ స్వరం
2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై “నీచ్ కిస్మ్” (అథమ స్థాయి) అంటూ అవమానకరమైన వ్యాఖ్య చేసినందుకు అయ్యర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. ఒక సంవత్సరం తర్వాత, సస్పెన్షన్ రద్దు చేసినప్పటికి పార్టీలో ఎటువంటి సంస్థాగత బాధ్యతలు ఇవ్వలేదు. అప్పటి నుండి, ఆయన పార్టీని ఇబ్బంది పెట్టే అనేక వ్యాఖ్యలు చేశారు. అయితే అయ్యర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని పవన్ ఖేరా, జైరామ్ రమేష్ లు కొట్టిపారేశారు. అంతకుముందుకూడా మణిశంకర్ అయ్యర్ దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘రాజీవ్‌గాంధీ ఓ సాధారణ పైలట్.. రెండుసార్లు పరీక్షలు తప్పిన వ్యక్తి దేశానికి ప్రధాని ఎలా అయ్యారా… అని తాను అనుకొనేవాడిని’ అని చెప్పారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాజీవ్‌తో కలిసి తాను చదువుకున్నానని, అక్కడ ఆయన పరీక్ష తప్పారన్నారు. తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కళాశాలలో చదువుకొనేందుకు వెళ్లారని, అక్కడా కూడా రాజీవ్ పరీక్ష తప్పారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని అప్పుడు తాను భావించానంటూ పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు కూడా మణిశంకర్ అయ్యర్ పార్టీ సూచనలను ధిక్కరించి..తిరువనంతపురం సెమినార్ కు హాజరవ్వడంతో పాటు పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం చర్చనీయాంశమైంది.
తమిళనాడులోనూ మాణిక్యం ఠాగూర్ కలకలం
తమిళనాడులో ఎంపీ మాణిక్కం ఠాకూర్ సహా ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేతలు డీఎంకేతో పొత్తును వ్యతిరేకిస్తూ..టీవీకేతో పొత్తుకు ఆసక్తి చూపుతూ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా డీఎంకేపై విమర్శలు సంధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లతో పాటు అధికారంలో వాటా కావాలంటూ డీఎంకే పొత్తు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందు తమ డిమాండ్లు పెట్టారు.“2021లో మీరు (డీఎంకే) 173 సీట్లలో పోటీ చేసి 133 స్థానాల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే గెలవని సీట్లను మేము (కాంగ్రెస్) కోరుతున్నాం. అధికార భాగస్వామ్యం కూడా కావాలి. అధికారంలో వాటా మా పార్టీ హక్కు. ప్రజలే ఆ విషయాన్ని నిర్ణయిస్తారు” అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
2021 ఎన్నికల్లో 234 సీట్లు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో 25 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తే 18 సీట్లు గెలుచుకున్నప్పటికి వారికి డీఎంకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించకపోవడం తమిళ కాంగ్రెస్ నాయకులను అసంతృప్తికి గురి చేసింది. ఈ నేపథ్యంలో వారు టీవీకేతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో పొత్తులు మాత్రమే అని, సంకీర్ణ ప్రభుత్వాలు చెల్లుబాటు కావని మరోవైపు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేస్తుండగా, తమకు అధికారంలో వాటా కావాల్సిందే అంటూ కాంగ్రెస్ రచ్చ చేస్తుంది. దీంతో ఎన్నికల ముందు తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్ బంధం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ. “కాంగ్రెస్, డీఎంకె పాత మిత్రులు” అని ఫాసిస్ట్ శక్తులతో పోరాడటానికి “మేము కలిసి కొనసాగుతాం” అని స్పష్టత ఇచ్చారు.
అప్పుడు గులాం నబీ అజాద్.. ఇప్పుడు అయ్యర్
కాంగ్రెస్‌లో ఒక దశలో కలకలం రేపిన గ్రూప్ ఆఫ్ 23.. పార్టీ నాయకత్వంలో, సంస్థాగతంలో సమూల మార్పులు డిమాండ్ చేస్తూ లేఖ రాసింది. దానికి నాయకత్వం వహించిన గులాం నబీ ఆజాద్.. 2022 ఆగస్టు 26న ఒక లేఖ రాస్తూ.. రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకుడని పేర్కొన్నారు. అనంతరం ఆయన బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టుకున్నారు. పార్టీని వీడే ముందు ఆయన సోనియాకు రాసిన లేఖలో రాహుల్ నాయకత్వ తీరును తూర్పారబట్టారు. 2013లో రాహుల్ గాంధీని పార్టీ ఉపాధ్యక్షుడిగా చేయగానే.. పార్టీలో అప్పటి వరకు ఉన్న సలహా సంప్రదింపుల వ్యవస్థను ధ్వంసం చేశారని తప్పుపట్టారు. పేరుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే అయినా.. నిర్ణయాలు మొత్తం రాహుల్, ఆయన కోటరీ తీసుకుంటోందని ఆరోపించారు. ఒక దశలో రాహుల్ భద్రతా సిబ్బంది, పీఏలు కూడా నిర్ణయాలు తీసుకొంటున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 2014-22 మధ్యలో జరిగిన మొత్తం 49 ఎన్నికల్లో 39 చోట్ల ఓడిపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిందని.. పార్టీలో ఎన్నికల వ్యవస్థ మొత్తం బూటకంగా, అవమానకరంగా మారిందని ఆరోపించారు.ఆజాద్ నిష్క్రమణ కాంగ్రెస్‌లోని వర్గాలకు షాక్ కు గురి చేసింది. ఆ తదనంతరం 2024పార్లమెంటు ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుస ఓటములతో ఒక్కో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై బాహటంగా విమర్శలు చేస్తుండటం.. కొందరైతే పార్టీకి గుడ్ బై కొట్టడం కొనసాగుతున్నది. వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు తిరుగుబాటు నేతల వ్యవహారం మరింత సంకట పరిణామాలను సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also |
Project Cheetah India| ప్రాజెక్టు చీతాలో మరో పురోగతి.. కునో పార్కులో మూడు చీతా కూనల జననం
Marriages | ముగిసిన మూఢం.. నేటి నుంచి మే 9 వరకు మోగనున్న పెళ్లి భాజాలు..!
Media Accreditation Controversy | జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
