- సచ్చినా… బతికినా తెలంగాణ కోసమే
- ప్రాణమున్నంత వరకు పోరాడుతా
- తెలంగాణ హక్కులకు భంగం కలిగించను
- దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిన
విధాత, హైదరాబాద్ : తెలంగాణ నీళ్ల విషయంలో, అభివృద్ధి విషయంలో మేమంతా ఏకాభిప్రాయంతో పనిచేస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల కోసం పోరాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చచ్చినా తెలంగాణ కోసం చస్తాం.. బ్రతికినా తెలంగాణ కోసం బ్రతుకుతాం.. ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన అని, దేవుడి మీద ఆన… నేను ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయననని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
శనివారం నాడు అసెంబ్లీలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చర్చలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గడచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, హాజరై సూచనలు, సలహాలు ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరీ అయి, చర్చలో పాల్గొనం అని మాజీ మంత్రి టీ.హరీష్ రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమేనన్నారు. మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని హరీశ్, కేటీఆర్ లు, తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడారన్నారు. వారు అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొని ఉంటే… ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు.. ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలిసేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.
కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని మాజీ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించామని అన్నారు. ఇక్కడ జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారన్నారు. ఎందుకంటే… ఇక్కడ అబద్దానికి ఆస్కారం లేదని, మాటల గారడీలకు స్థానం లేదన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాబోదన్నారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ అసెంబ్లీ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ప్రతిమాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయన్న నమ్మకం ప్రజల్లో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసిందన్నారు. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు లు మంత్రులుగా బాధ్యతలు చేపట్టాక ప్రజలకు మరణ శాసనం రాశారన్నారు. 2015 జూన్లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు. 2016 సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని అప్పటి సీఎం కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 2020 అక్టోబర్ 6వ తేదీన జరిగిన రెండో అపెక్స్ మీటింగ్ లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ లను ఆహ్వానించామని అన్నారు. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా గైర్హాజరు అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టాలని మొట్ట మొదట 2009 లో ఆనాటి కాంగ్రెస్ ఎంపీ డీ.విఠల్ రావు, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కి లేఖ రాశారు. చరిత్రలో పాలమూరు రంగారెడ్డికి ఎలా పునాదులు పడ్డాయో తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విఠల్ రావు ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోట్లాడి పాలమూరు రంగారెడ్డిని సాధించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆ సమయంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల ఇవ్వాలని అడగలేదని, ఏ నైతిక హక్కుతో కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నారు? మీ బట్టలూడదీస్తాం, తోలు తీస్తాం అని మాట్లాడిన వాళ్లు ఇవాళ అసెంబ్లీ చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలూడదీయాలో, ఎవరి తోలు తీయాలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించే వాళ్లన్నారు. జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల వరద జలాలను మళ్లించి సాగునీటిని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్ర ఆమోదం తెలిపింది. జూరాల నుంచి 70 టీఎంసీల వరద జలాలతో పాలమూరు ప్రాజెక్టు సర్వేతో పాటు డీపీఆర్ తయారు చేయాలని హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా కు జీఓ ద్వారా బాధ్యతలు అప్పగించిందన్నారు. జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరానికి చెందిన నిపుణులు, ఇంజనీర్లు సూచించారు. 26 రోజుల తర్వాత ఈ ప్రాజెక్టును కేసీఆర్ ఒక పథకం ప్రకారం సమూలంగా మార్చివేశారన్నారు. జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ను శ్రీశైలం నుంచి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. జూరాల వద్ద నిర్మిస్తే పంపులకు రూ.5,185 కోట్లు అంచనా వేస్తే … సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పంపులు, లిఫ్టుల సంఖ్య పెంచారు. 37 పంపులకు 10,335 కోట్లకు అంచనాలు పెంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు
ఇవి కూడా చదవండి :
కేసీఆర్, హరీశ్‌లను ఉరేసినా తప్పులేదు: సీఎం రేవంత్ రెడ్డి
నయా రాజకీయం…ఎన్నికల్లో చెప్పనవి చేస్తారు!
మూసీ కారణంగా నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు
