Site icon vidhaatha

Sexual Assault: దారుణం..ఐసీయూలో మహిళపై లైంగికదాడి!

మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఘాతుకం..
రాజస్థాన్ ఆసుపత్రిలో దారుణం
ఆసుపత్రి సిబ్బందినే నిందితుడు

విధాత: కామాంధుల దాష్టికానికి చిన్నారి బాలికలు మొదలుకుని..వృద్ధురాలుల వరకు బలవుతున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన దేశంలో వెలుగుచూసింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళాపై ఆసుపత్రి సిబ్బందినే అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గ ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. అల్వార్‌లోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో చేరిన మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయంలో ఎంఐఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు జూన్ 4న రాజస్థాన్‌లోని ఈఎస్ఐసీ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది ఒకరు అత్యాచారం చేశాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 2న బాధిత మహిళను ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన మహిళ స్పృహలోకి వచ్చింది. దీంతో వార్డు సిబ్బంది ఆమె భర్తను పిలిపించారు. ఆ సమయంలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిన ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది.

బాధితురాలి కథనం ప్రకారం.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ముందు మత్తుమందు ఇంజెక్ట్ చేశాడు. ఆమె అప్పటికే సగం స్పృహ కోల్పోయింది. నిందితుడు తనపై అత్యాచారం చేయబోతుండటం గమనించి ప్రతిఘటించింది. అదే క్రమంలో ఆమె మత్తులోకి జారుకుంది. మరునాడు ఉదయం జూన్ 5న మళ్లీ స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన దారుణాన్ని కుటుంబీకులకు తెలిపింది. బాధితురాలి భర్త వైద్య కళాశాల అధికారులను ఫిర్యాదు చేసినప్పటికి వారు విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. దీంతో అతను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన నర్సింగ్‌ సిబ్బందిని నిందితుడిగా గుర్తించారు. ఆసుపత్రి అధికారులు దీనిపై విచారణ కమిటీ వేస్తామని ప్రకటించారు.

Exit mobile version