Site icon vidhaatha

బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

Wild Bear | ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. రహదారిపై ఓ వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మరో ఇద్దరిపై కూడా దాడి చేసి.. అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన తమిళనాడులోని టిన్ కాశీ జిల్లాలో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. కరుతిలింగాపురం గ్రామానికి చెందిన విగుందమణి అనే వ్యక్తి మసాలా ప్యాకెట్లను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శివశైలం నుంచి పీఠాన్ పల్లి వైపు బైక్ పై వెళ్తుండగా.. టిన్ కాశీలోని అటవీ మార్గంలో ఎలుగుబంటి అడ్డుకుంది. అతనిపై ఒక్కసారిగా దూకేసింది. దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

విగుందమణి అరుపులు విన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులకు సమాచారం అందించారు. అందరూ అక్కడికి చేరుకొని ఎలుగుబంటిని తరిమేందుకు యత్నించారు. కానీ ఎలుగుబంటి బెదరలేదు. ఆ గుంపుపై కూడా దాడి చేసింది. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విగుందమణి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించారు.

Exit mobile version