Dog vs Tiger | కుక్కలంటేనే విశ్వాసానికి మారు పేరు. తమ యజమానుల కోసం ప్రాణాలను కూడా పణంగా పెడుతాయి శునకాలు. ఓ కుక్క కూడా తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఓ పెద్ద పులితో పోరాటమే చేసింది. పులి దాడి నుంచి యజమానిని రక్షించి.. అదే పులి చేతిలో కుక్క బలైంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ పరిధిలోని మదన్‌పూర్ గయిబువా గ్రామానికి చెందిన రక్షిత్ పాండే ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఇటీవలే తన కుక్కతో కలిసి చెరుకు పంట వద్దకు వెళ్లాడు. ఆ చెరుకు పొదల్లో పెద్ద పులి మాటు వేసిన విషయాన్ని రక్షిత్ గుర్తించలేకపోయాడు. పొలంలోకి ప్రవేశించిన వెంటనే పెద్ద పులి రక్షిత్‌పై దాడి చేసింది. అక్కడే ఉన్న కుక్క ఏ మాత్రం భయపడకుండా పులితో యుద్ధానికి దిగింది. పెద్ద పులి దాడి నుంచి యజమానిని కాపాడి.. దాంతో హోరాహోరీగా ఫైట్ చేసింది.
కానీ చివరకు పెద్ద పులి చేతిలో కుక్క ప్రాణాలు విడిచింది. దాన్ని రక్తాన్ని కళ్లారా చూసిన పెద్ద పుల్లి అక్కడి నుంచి గాండ్రిస్తూ మెల్లిగా జారుకుంది.
ఈ పెద్ద పులి సంచారంపై రక్షిత్ తన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రలను సేకరించారు. ఇక రైతులను అప్రమత్తం చేశారు. వ్యవసాయ పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరించారు.
