Site icon vidhaatha

BJP | బీజేపీకీ.. కూట‌మే దిక్కు

BJP

(అజయ్‌ కే ముఖర్జీ)
వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోయిన ఎన్నిక‌ల‌కంటే ఎక్కువ స్థానాల‌ను గెలుస్తామ‌ని బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్నారు. ఆ పార్టీ కూలీ ట్రోలు గుంపులు అయితే బీజేపీకి ఈసారి 350 నుంచి 400 స్థానాలు వ‌స్తాయ‌ని ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే నిజంగానే అటువంటి ప‌రిస్థితి ఉందా? ఉంటే చిన్న‌చిత‌కా పార్టీల‌ను పోగేసి నాలుగేళ్ల క్రితం మూల‌న‌ప‌డేసిన ఎన్‌డీఏను బీజేపీ ఇప్పుడెందుకు తెర‌పైకి తెస్తున్న‌ది? తాము మాత్ర‌మే జాతీయ పార్టీగా మిగిలామ‌ని, మిగిలిన‌వ‌న్నీ ప్రాంతీయ పార్టీలేన‌ని తెగ కోత‌లు కోసిన బీజేపీ ఇప్పుడు ఆద‌రాబాద‌రాగా మ‌ళ్లీ పాత మిత్రుల‌ను ఎందుకు వెతుకుతున్న‌ది?

క‌ప్ప‌ల త‌క్కెడ కూట‌మి రాజ‌కీయాల‌కు కాలం చెల్లింద‌ని చెప్పిన బీజేపీ ఇప్పుడు పాత క‌ప్ప‌ల త‌క్కెడ‌ను ఎందుకు స‌రిచేసుకుంటున్న‌ది? బీజేపీ 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ కూట‌మిగానే పోటీ చేసిన‌ప్ప‌టికీ, సొంతంగా 303 స్థానాలు గెల్చుకుని ఇక ఏ పార్టీ అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో పాల‌న మొద‌లు పెట్టింది.

మ‌ర్యాద‌కోసం అకాలీద‌ళ్‌, జేడీయూ, శివ‌సేన‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించినా ఆ పార్టీల‌న్నీ ఆ త‌ర్వాత కొంత‌కాలానికే కేంద్రం నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాయి. ఇక ఎన్‌డీఏలో మిగిలిన మెజారిటీ ప‌క్షాలు లోక్‌స‌భ‌లో ఏక‌స‌భ్య పార్టీలే. ఆర్పీఐ, అప్నాద‌ళ్‌, ఎన్‌డీపీపీ, ఎస్‌బీఎస్‌పీ, ఎన్‌పీఎఫ్‌, ఎన్‌పీపీ, ఎంఎన్ఎఫ్‌, ఆర్ఎల్‌పీ, ఎస్‌కేఎం, ఎఐఎడీఎంకె, వీసీకె, ఏజేఎస్‌యూ.. వీట‌న్నిటికీ లోక్‌స‌భ‌లో ఒక్కొక్కరు స‌భ్యులే ఉన్నారు.

గుజ‌రాత్‌ (26), అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌ (2), హ‌ర్యానా (10), హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ (4), త్రిపుర‌ (2), ఉత్త‌రాఖండ్‌ (5), ఢిల్లీ (7)ల‌లో నూటికి నూరు శాతం స్థానాల‌ను బీజేపీ గెలిచింది. ఆ రాష్ట్రాల‌లో ఇప్పుడు ఏక‌ప‌క్షంగా గెలిచే అవ‌కాశాలు ఎంత‌మాత్రం లేవు. క‌ర్ణాట‌క‌ (28), మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ (29), రాజ‌స్థాన్‌ (25), ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (80), ఛత్తీస్‌గఢ్‌ (11), జార్ఖండ్‌ (14) రాష్ట్రాల‌లో మొత్తం 187 స్థానాలు ఉండ‌గా బీజేపీ 159 స్థానాల‌ను గెల్చుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్క స్థానాన్ని మాత్ర‌మే విప‌క్షాలు గెలిచాయి.

ఆ రాష్ట్రాల‌లో ఈసారి ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతున్న‌దో ఇప్ప‌టికే కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చింది. బీజేపీ ఇప్ప‌టి స్థానాల‌లో స‌గం స్థానాల‌ను కూడా నిల‌బెట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. బీజేపీ బీహార్‌ (40), మ‌హారాష్ట్ర‌ (48)ల‌లో జేడీయూ, ఎల్‌జేపీ, శివ‌సేన‌లతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఎన్‌డీఏ కూట‌మి బీహార్‌లో 39 స్థానాల‌ను గెల్చుకోగా, మ‌హారాష్ట్ర‌లో 41 స్థానాల‌ను గెల్చుకుంది. ఈ సారి రెండు రాష్ట్రాల‌లోనూ బీజేపీ ఎదురీద‌వ‌ల‌సి వ‌స్తుంది. జేడీయూ బ‌య‌టికి వెళ్లి ఆర్జేడీతో క‌లిసింది.

జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు బీహార్‌ను ఈసారి ఊడ్చుతాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితి నిల‌క‌డ‌లేకుండా ఉంది. ఇప్ప‌టికిప్పుడు ఏమీ చెప్ప‌లేమ‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్‌, శివ‌సేన‌, ఎన్‌సీపీల జ‌ట్టు అక్క‌డ బ‌ల‌మైన శ‌క్తిగా ఆవిర్భ‌వించాయ‌ని వారు చెబుతున్నారు. బెంగాల్‌లో కూడా బీజేపీకి అనుకూల ప‌రిస్థితి లేదు. మొత్తంగా న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో బీజేపీ ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటున్న‌ది.

అందుకే బీజేపీ భ‌య‌ప‌డిపోయింది. తొమ్మిదేళ్ల త‌ర్వాత‌ బీజేపీ భ‌య‌ప‌డ‌డం ఇదే. ప్ర‌తిప‌క్షాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ తొక్కి నార‌దీస్తున్నామ‌ని గ‌ప్పాలు పోయిన బీజేపీ ఇప్పుడు వారిలో మిత్రుల‌ను వెతుక్కునే ప‌ని మొద‌లు పెట్టింది. ఇంత‌కాలం దూరంగా ఉన్న చంద్ర‌బాబు నాయుడును పిలిచి మాట్లాడుకున్న‌ది. మ‌రోవైపు అడిగిన‌వ‌న్నీ ఇస్తూ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని మ‌చ్చిక చేసుకుంటున్న‌ది.

తెలంగాణ‌లో బీఆరెస్‌పై కారాలు మిరియాలు నూర‌డం ఆపేసింది. వ్యూహాత్మ‌క మిత్ర‌త్వాన్ని కాపాడుకునేందుకు ఇరుప‌క్షాలు ప్ర‌స్తుతానికి తిట్లు, దూష‌ణ‌ల‌ను ప‌క్క‌న ప‌డేశాయి. బీజేపీ నాయ‌క‌త్వం మేము లేస్తే మ‌నుషులం కాము ఇని ఇంత‌కాలం బెదిరిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు లేచినా ప్ర‌యోజ‌నం లేద‌ని తేల్చేశారు. ఇద్ద‌రి ల‌క్ష్యం కాంగ్రెస్ ఎద‌గ‌కుండా చూడ‌డ‌మే.

అందుకే ప‌ర‌స్ప‌రం తిట్టుకుంటూ ఒక‌రిని ఒక‌రు లేపుకుంటూ తెలంగాణ‌లో అధికారాన్ని కాపాడుకోవాల‌ని చూసిన బీజేపీ, బీఆరెస్‌లకు ఇప్పుడు న‌టించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. బీజేపీ, బీఆరెస్‌ల ర‌హ‌స్య మిత్ర‌త్వాన్ని గ్రామీణ స్థాయిదాకా జ‌నం గుర్తించారు. ఇప్పుడు ఏమి చేసినా అది న‌ట‌న‌గానే జ‌నానికి అర్థ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. మ‌హారాష్ట్ర‌లో చీలిక గ్రూపుల ఓట్లు బీజేపీ ప‌ర‌ప‌తిని నిల‌బెట్ట‌డానికి ఎంత‌మేర‌కు ప‌నికి వ‌స్తాయో చూడాలి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైన ప్ర‌తిప‌క్షాలు స‌గం స్థానాల‌ను గెల్చుకునే అవ‌కాశం ఉంది. ఢిల్లీ, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లు ఈసారి ఎదురు తిర‌గే అవ‌కాశం ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌డ్‌, జార్కండులు ఈసారి ప్ర‌తిప‌క్ష కూట‌మికి అండ‌గా నిల‌బ‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

బీజేపీ స్వ‌యంగా ఎన్‌డీఏను పోగేస్తున్న‌ది కాబ‌ట్టి ఫ్రంటు రాజ‌కీయాలు కాదు టెంటు రాజ‌కీయాలు అని వెక్కిరించే అవ‌కాశం లేకుండా పోయింది. ఎన్‌డీఏలో పోగేస్తున్న‌ది కూడా పెద్ద పార్టీల‌ను కాదు గుమ్మ‌య్య జ‌క్క‌య్య లాంటి పార్టీల‌ను. ఒక్క ఎల్జేపీకి మాత్ర‌మే ఆరు సీట్ల బ‌లం ఉంది. మిగిలినవ‌న్నీ ఏక‌స‌భ్య పార్టీలే.

క‌ప్ప‌ల‌త‌క్కెడ‌ను ఎన్నుకుంటారా మ‌మ్మ‌ల్ని ఎన్నుకుంటారా అని బీజేపీ ఇటీవ‌ల కొంత‌కాలం పాటు మాట్లాడుతూ వ‌చ్చింది. ఇప్పుడు స్వ‌యంగా ఒక క‌ప్ప‌ల త‌క్కెడ‌ను త‌యారు చేసుకున్న‌ది కాబ‌ట్టి ఆ పాట అనే నైతిక బ‌లం బీజేపీకి పోయింది. ఎన్‌డీఏలో ఉన్న పార్టీల‌న్నీ ఏమాత్రం భావసారూప్య‌త లేని అవ‌కాశ‌వాద గుంపు. ప్ర‌తిప‌క్ష కూట‌మి క‌నీస ఉమ్మ‌డి కార్య‌క్ర‌మంపై ఏక‌మైన రాజ‌కీయ వేదిక‌.

Exit mobile version