Site icon vidhaatha

BJP VS BRS | బీజేపీ వ‌ర్సెస్‌ బీఆర్ఎస్.. ట్విట్టర్ వార్

BJP VS BRS Twitter War

విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్ర మాజీమంత్రి, బిజెపి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోకి పాదరక్షలతో వెళ్లారనే ప్రచారం బిజెపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య అగ్గి రాజేసింది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని కొందరు ఫాల్తుగాళ్లు చేస్తున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రకాష్ జవదేకర్ చెప్పులు వేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదన్నారు.

73 ఏళ్ల వ్యక్తిపై దుర్మార్గపు ప్రచారాలు చేయడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు విషయం ఏమిటో ఆలయ పూజారులను అడిగితే తెలుస్తుందన్నారు. వేములవాడ ఆలయ గర్భగుడిలోకి బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జవదేకర్ చెప్పులతో వెళ్లారంటూ బీఆర్ఎస్ కు చెందిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే క్రిశాంక్ ట్విట్ చేశారు.

ఆయనను పాదరక్షలు విడువాలని అర్చకులు కోరినట్లు అందులో పేర్కొన్నారు. అయితే క్రిశాంక్ ట్వీట్ సత్యదూరమైందంటూ బిజెపి వర్గీయులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. గతంలో యాదాద్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పాదరక్షలతో ఆలయంలోకి వెళ్లిన దృశ్యాలను పోస్ట్ చేస్తూ బిజెపి నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో ట్విటర్ వేదికగా బిజెపి నేతల వేములవాడ ఆలయ సందర్శన. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

అది దుష్ప్రచారం: ఆలయ అర్చకులు

ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి చెప్పులు వేసుకుని ఆలయంలోకి వచ్చారని జరుగుతున్న ప్రచారంలో అర్థం లేదని ఆలయ పూజారులు స్పష్టం చేశారు. ఇదంతా దుష్ప్రచారంలో భాగమేనని వారన్నారు. కొంతమంది ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version