Site icon vidhaatha

Budget-2024 | ఫిబ్రవరి 1న నిర్మలమ్మ పద్దు..!

Budget-2024 | ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. అంతకు ముందే కేంద్ర ప్రభుత్వం చివరిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నది. ఈ నెల 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్‌పైనే సామాన్యులు, మధ్య తరగతిపైనే ఆశలు పెట్టుకున్నారు.


అయితే, ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రజాకర్షక పథకాలు, ప్రకటలకు దూరంగా ఉండబోతున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక వివేకంపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. అయితే, మహిళలు కొన్ని ప్రత్యేక పన్ను ఉపశమనం కల్పించే చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాత పెన్షన్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగులు పాత పెన్షన్‌ కోసం ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న కొత్త పెన్షన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చబోతుందని, ఇందులో బడ్జెట్‌లో మార్పులు ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికలకు ముందు స్టాండర్డ్‌ డిడక్షన్‌ని పెంచి ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కలిగించే అవకాశాలున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండగా.. ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి.


అయితే, బడ్జెట్‌ సందర్భంగా పలువురు ఆర్థిక వేత్తలు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో చర్యలను పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు కనిపించే అవకాశం లేదన్నారు. ఇంతకు ముందే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాలను ప్రకటించిందని పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లోనూ ఈ పథకాలు కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కొత్త పెన్షన్‌ స్కీమ్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు బడ్జెట్‌లో పలు ప్రకటనలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. పాత పెన్షన్‌ రాజకీయంగా సవాల్‌గా మారింది. ఇప్పటికే పంజాబ్‌, రాజస్థాన్‌ సహా పలు ఇప్పటికే పాత పెన్షన్‌ను అమలులోకి తీసుకువచ్చాయి.


ఈ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమకు పాత పెన్షన్‌ విధానం తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటికే జాతీయ పెన్షన్‌ (ఎన్‌పీఎస్)పై సమీక్షించేందుకు గతేడాది ఏప్రిల్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ సలహాలు, సూచనల మేరకు కొత్త పెన్షన్‌లో ఏవైనా మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్రం పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏమాత్రం అవకాశం లేదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version