CAG
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో 100రోజుల పాటు 22,669కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిందని కాగ్ తెలిపింది. తెలంగాణ ఆర్ధిక స్థితిగతులపై 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెందిన కాగ్ నివేదికను ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసన సభకు సమర్పించారు.
ఈ నివేదికలో 259రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యం వినియోగించుకుందని తెలిపింది. ప్రభుత్వం 289రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని వినియోగించుకుందని పేర్కొన్నది. 2021-22 వరకు రాష్ట్ర రుణాలు 3,14,662కోట్లకు పెరిగాయని తెలిపింది. ఈ రుణాలు జీఎస్‌డీపీలో 27.40 శాతంగా ఉన్నట్లు పేర్కోంది. అయితే జీఎస్‌డీపీ పెరుగుదలకు అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్ స్పష్టం చేసింది.
గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు చేసిందని తెలిపింది. 2020-21లో రెవెన్యూ లోటు 9,335కోట్లుగా ఉందని కాగ్ పేర్కొన్నది. రాష్ట్రానికి పన్నుల నుంచి వచ్చిన ఆదాయం 37శాతం కాగా, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు 44శాతం తగ్గాయని, రెవెన్యూ రాబడులలో 50శాతం వేతనాలు, వడ్డీలకే చెల్లిస్తుందని తెలిపింది.
రాష్ట్ర అంచనా ఆదాయం రూ. 2,21,687కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 1,74,15కోట్లు అని పేర్కొన్నది. రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాల మేరకురూ. 6,744కోట్లు కాగా వాస్తవ లెక్కల మేరకు 9,335కోట్లకు లోటు పెరిగిందని తెలిపింది. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 1,09,992కోట్లు కాగా, కేంద్ర నుండి వచ్చిన గ్రాంట్లు రూ.8,169కోట్లని పేర్కొన్నది.
ప్రణాళికేతర వ్యయం రూ. 32,979కోట్లు, జీతాలకురూ. 30,951కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.19,161కోట్లు, మౌలిక వసతులకు 28,308కోట్లుగా పేర్కొన్నది. నివేదికలో నీటి పారుదల, వైద్యారోగ్యం, పంచాతీరాజ్ శాఖలకు 30శాతం అధికంగా ఖర్చు చేసినట్లుగా కాగ్ తెలిపింది.