Hyderabad | తప్పెవరిది.. శిక్ష ఎవరికి.. ఫిలింనగర్‌లో విషాదం

ఫిలింనగర్‌లో ఓ మైనర్ (14) బైక్ నడుపుతూ బీఎండబ్ల్యూ కారును ఢీ కొట్టిన ఘటన అతడి తల్లి ఆత్మహత్యకు.. కారు డ్రైవర్లు కేసుల్లో ఇరుక్కుని వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడటానికి కారణమైంది

  • Publish Date - April 19, 2024 / 02:34 PM IST

విధాత, హైదరాబాద్: ఫిలింనగర్‌లో ఓ మైనర్ (14) బైక్ నడుపుతూ బీఎండబ్ల్యూ కారును ఢీ కొట్టిన ఘటన అతడి తల్లి ఆత్మహత్యకు.. కారు డ్రైవర్లు కేసుల్లో ఇరుక్కుని వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడటానికి కారణమైంది. ఈ ఘటనలో తప్పు ఒకరికైతే శిక్షలు మరొకరికి అన్నట్లుగా వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి.

వివరాల్లోకి వెళితే ఫిలిం నగర్‌లో బైక్ నడుపుతూ మైనర్ బాలుడు బీఎండబ్ల్యూ కారుని ఢీకొట్టాడు. కారు మరమ్మతుల కోసం ఆ కారు డ్రైవర్లు మైనర్ కుటుంబాన్ని 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే మైనర్ పై డ్రైవింగ్ కేసు పెడతాం అంటూ హెచ్చరించారు. అయితే మైనర్ తల్లి సూర్యకుమారి(35) తన వద్ద చేతిలో చిల్లి గవ్వ లేదని..కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త ఫిర్యాదుతో ఇద్దరు డైవర్ల మీద ఐపీసీ 306 సెక్షన్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

చంద్ర శేఖర్, మహేష్ అనే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య వ్యవహారంలో తమ తప్పేమి లేదని, తమ కారుకి డామేజ్ అయితే యజమాని మమ్మల్ని ఊరుకోడని మరమ్మతు కోసం డబ్బులు అడిగామని ఇలా జరుగుతుందనుకోలేదని ఆ డ్రైవర్లు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. మా మీద కేసు పెడితే మా కుటుంబాలు రోడ్డున పడతాయిని వాపోయారు. ఈ కేసును ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News