Dubbaka |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా దుబ్బాక నియోజక వర్గం టికెట్… సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపింది. మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కి అవకాశం కల్పించారు. ఇక్కడి నుండి 2004 నుండి గెలుస్తూ వచ్చిన దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు.
సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సోలిపేట సుజాతకు అవకాశం ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప ఓట్ల మెజారిటీతో సుజాతారెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వలేదు.
బీజేపీ నుండి బలమైన అభ్యర్థి రఘునందన్ రావు ఉండడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి వైపు పార్టీ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ కు టికెట్ ఇస్తే గెలిచే వారని అంటున్నారు.
ఆ ఎన్నికల్లో సుజాతకు అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఆ కుటుంబాన్ని విస్మరించడం సోలిపేట అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. సోలిపేట సతీష్ రెడ్డికి అవకాశం దక్కుతుందని భావించిన వారి అనుచరులు నిరాశ చెందారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తారా.. లేదా మరో నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.