విధాత, మెదక్ బ్యూరో: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతను కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. వారికి పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్, ఇవో శ్రీనివాస్ ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి వన దుర్గా భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం గంగా, యమున, సరస్వతి నదుల సమ్మేళనమని ఇలాంటి పవిత్ర భూమిలో బీజేపీ ప్రభుత్వం మతాలను వేరు చేస్తూ అల్లకల్లోలం చేస్తుందన్నారు.
బీజేపీ ప్రభుత్వ దుందుడుకు చర్యలను అరికట్టేందుకు, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించాలని, దేశ ప్రజలకు, అన్నదాతలకు నిరంతరాయంగా 24గంటల విద్యుత్ సరఫరా చేయాలన్న తలంపుతో సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని నెలకొల్పినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి నిధులు కేటాయించి పుణ్య క్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తిర్చిదిద్దుతున్నారన్నారు. జాతీయ స్థాయిలో పార్టీని నొలకొల్పినట్లు మంత్రి తెలిపారు.