ఎన్డీఎస్‌ఏకు నాలుగు నెలల సమయం ఎందుకు ఇచ్చారు?
కాళేశ్వరం సమస్యపై బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కాళేశ్వరంపై 4 వారాల్లో ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇస్తే.. ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫైనల్‌గా ఎన్డీఎస్‌ఏ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. బరాజ్‌కు మరమ్మతులు చేయమంటే చేయిస్తామని చెప్పారు. మేడిగడ్డకు రిపేర్లు చేయాలని కేసీఆర్ అనడం వెనుక రాజకీయం ఉందని చెప్పారు. ‘అసలు ఎన్డీఎస్‌ఏ కమిటీకి నాలుగు నెలల సమయం ఎందుకిచ్చారు? అంతలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్ సర్దుకోవడానికా?’ అని నిలదీశారు. ‘కాశేళ్వరం రావు’ కట్టిన మేడిగడ్డ ఆయన హయాంలోనే మేడిపండులా కూలిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా కేసీఆర్ అవినీతిపై లీగల్ ప్రాసెస్ ఉంటుందన్నారు. కర్ణాటకలో బీజేపీ 40% కమీషన్లపై మోదీ ఎందుకు మాట్లాడలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. తుమ్మిడిహెట్టి నిర్మించి ఆదిలాబాద్‌కు నీళ్లు ఇస్తామని వెల్లడించారు.
ఇతర పార్టీ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే తప్పేంటి?
తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలని, కొందరు పిచ్చిపట్టి ఏదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరూ లేరన్న రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసీఆర్ చదివింది బీఏ అయితే పీజీ చదివినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం
తెలంగాణను పది ఏండ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే.. వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగిందన్నారు. జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. జీఎస్టీ వసూళ్లలో భారీ కుంభకోణం జరిగిందని, దొంగలను బయటకు తీస్తున్నామన్నారు. ఎల్‌ఆరెస్‌పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామన్నారు. ఎల్‌ఆరెస్‌పై కేటీఆర్ రోజంతా ధర్నా చేయాలన్నారు. సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుందని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్యాక్స్ పేయర్స్‌కు రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇస్తామని, దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.