CM Revanth Reddy | భువనగిరిని హస్తగతం చేసుకోవాలి

  • Publish Date - April 10, 2024 / 04:38 PM IST

  • 21న నామినేషన్‌..బహిరంగ సభ

  • పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ధేశం

  • మే తొలి వారంలో ప్రియాంక గాంధీ సభ

  • రాజగోపాల్‌రెడ్డి నివాసంలో సమీక్షా సమావేశంలో వెల్లడి

 

విధాత, హైదరాబాద్‌: తెలంగాణలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14ఎంపీ సీట్ల లక్ష్య సాధనలో భాగంగా భువనగిరి ఎంపీ సీటును హస్తగతం చేసుకోవాలని ఇందుకు పార్టీ ముఖ్యనేతలంతా కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బుధవారం పార్టీ మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు స్థానం గెలుపు వ్యూహాలపై చర్చించారు.

సమావేశానికి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, మందుల సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డిలు సహా ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉందని, భారీ మెజార్టీ ఆశిస్తున్నామన్నారు. అయితే గెలుస్తామన్న అతి విశ్వాసంతో ఉదాసీనతగా వ్యవహరించకుండా రంజాన్ ముగిసిన వెంటనే ప్రజాక్షేత్రంలో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మేరకు రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలను ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని సూచించారు. ఈ నెల 21న భువనగిరి లోక్‌సభ స్థానం పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం, అదే రోజు తన బహిరంగ సభ నిర్వాహణ ఉంటుందన్నారు. మే తొలి వారంలో తెలంగాణలో ప్రియాంకగాంధీ పర్యటన ఉంటుందని, అందులో భాగంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మిర్యాలగూడ, చౌటుప్పల్‌లో ప్రియాంకగాంధీ బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.

ఏడింటిలో ఆరు సెగ్మెంట్‌లు కాంగ్రెస్ ఖాతాలోనే

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలువగా, 2014లో బీఆరెస్ నుంచి బూర నర్సయ్యగౌడ్, 2019లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం భువనగిరి లోక్‌సభ నియోజవకర్గం పరిధిలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌(ఎస్సీ), తుంగతుర్తి(ఎస్సీ), ఇబ్రహీంపట్నంలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జనగామలో మాత్రం బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏడింటిలో ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండటంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అయితే బీసీ ఓటర్లు మెజార్టీగా ఉన్న భువనగిరి లోక్ సభ స్థానంలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌యాదవ్, బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌లు బీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

ముఖ్యంగా బీజేపీ అభ్యర్థికి బూర నర్సయ్యగౌడ్ గతంలో ఈ నియోజకర్గం నుంచి బీఆరెస్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం, మోదీ చరిస్మా నేపథ్యంలో ఆయన నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్లి ఆయన నివాసంలోనే భువనగిరి లోక్‌సభ స్థానంలో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాలపైన, గెలుపు వ్యూహాలపైన సమీక్ష చేసి పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను కార్యోన్నుఖులను చేయడం విశేషం.

Latest News