Ponguleti |
విధాత: భూమికి భద్రతకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని..ఎన్నో ఏళ్లుగా లక్షలల్లో పేరుకు పోయిన భూ సమస్యలకు పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన భూభారతి రెవెన్యూ చట్టం అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. పేదోడు గుండెపై చేయి వేసుకొని నిద్రపోయేలా భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని పొంగులేటి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం వారి స్వార్థం కోసం నాలుగు గోడల మధ్య నలుగురు కలిసి నాలుగు రోజులలో ధరణిని తీసుకువచ్చి ప్రజలను కష్టాలకు గురి చేశారని ఆరోపించారు.
ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలు తీర్చేందుకు నెలల తరబడి కష్టపడి ప్రతిపక్షాలు చేసిన సూచనలను స్వీకరించి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అసెంబ్లీలో భూభారతిని అడ్డుకునేందుకు దొర తొత్తులు నామీద, స్పీకర్ పై పత్రాలు చింపి విసిరి వేశారని గుర్తు చేశారు. భూ భారతితో ప్రజలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పనిలేదని అధికారులే గ్రామాలకు వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల కోసం స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో 6000 మంది సర్వేయర్లను శిక్షణ ఇప్పించి నియమించడం జరుగుతుందని, 10, 956 రెవిన్యూ గ్రామాలకు రెవిన్యూ అధికారులను నియమిస్తామన్నారు. 2025, మే 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 28 జిల్లాలోనూ జిల్లాకు ఒక మండలము ఎంపిక చేసి భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు పరుస్తామన్నారు. గతంలో సాదా బైనామా ధరణిలో అవకాశం లేకపోవడంతో కోర్టులు కూడా ఏమీ చేయలేకపోయాయన్నారు.
ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తాం
ధరణి క్రింద స్వీకరించిన పరిష్కారం కాని 9.26 లక్షల దరఖాస్తులను భూభారతి లో పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కబ్జా కు గురైన ప్రభుత్వ రెవెన్యూ, ఫారెస్ట్, భూదాన్,వక్ఫ్, దేవాదాయ భూములపై పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందించవచ్చునని, ఆక్రమించిన వారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూభారతి రైతులకు వరం కావాలన్నారు. అందుకు అధికారులు కృషి చేయాలని అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిందని ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇండ్లు ఇస్తామని సొల్లు చెప్పిందని ఇందిరమ్మ ప్రభుత్వం లక్షల ఇండ్లను ఈ నెలాఖరుకు ఇస్తుందన్నారు. యువ వికాసం పథకానికి 6000 కోట్లు కేటాయించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వినతి మేరకు అధిక ఇండ్లు మంజూరు చేస్తానని భువనగిరి నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయాల భవనాల పరిస్థితిపై కలెక్టర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పనికిమాలిన ధరణితో రైతులు ఆగమాగం అయ్యారని వారి కష్టాలు తీర్చేందుకు భూ భారతి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేదోళ్లకు చుట్టం భూభారతి అని మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే భూమికి భూధార్ కార్డు అందించడం జరుగుతుందని అన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని రెవెన్యూ సమస్యల పరిష్కారం భూభారతితో జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణితో విధ్వంసం సృష్టించిందని, అందుకే రైతులను కాపాడేందుకు భూ భారతిని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, డీసీసీ ఆకాంక్ష యాదవ్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.