Bhubharathi:
విధాత: జూన్ 2నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు చేస్తామని.. అధికారులే మీ ఇంటికి వచ్చి దరఖాస్తులు తీసుకొని సమస్యలు తీరుస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా షట్‌పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధరణి చట్టంతో రైతులు, ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.
తండ్రులు, తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం ఎత్తుకెళ్ళిందన్నారు. భూ యజమానుల ఇబ్బందులు తొలగించాలని ధరణిని బంగాళాఖాతంలో పడేశామన్నారు. 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను పరిశీలించి, మేధావులతో చర్చించి భూభారతి చట్టం తయారు చేశామని తెలిపారు. భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే అధికారులు మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తారన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాలను సెలెక్ట్ చేశాము. జూన్2 లోపు ఆ మండలాల్లో భూ సమస్యలు పూర్తిగా క్లియర్ చేస్తాం. జూన్ 2నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు చేస్తామని చెప్పారు.
పది రోజుల్లో రెవెన్యూ అధికారుల నియామకం
అధికారులు మాట వినలేదని కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు చూడలేక, ధరణి మాటున పేదలభూములను దొబ్బిన నాయకులకు.. మాజీ సీఎం కేసీఆర్‌కు దుఃఖం వస్తోందన్నారు.
రెండు సార్లు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినందుకే కేసీఆర్ కు దుఃఖం వస్తుందేమోనన్నారు. ఎందుకు దుఃఖం వస్తుందో కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగం పోయినందుకు కేసీఆర్ కు దుఃఖం వస్తుందా..? కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కేసీఆర్ కు దుఃఖం వస్తుందా.? అని పొంగులేటి ఎద్దేవా చేశారు.