Mother Dairy farmers protest| పాల బిల్లులు ఇవ్వండయ్యా..రోడ్డెక్కిన పాడి రైతులు

భువనగిరి మదర్ డెయిరీ రైతులు తమకు రావాల్సిన పాల పెండింగ్ బిల్లుల చెల్లించాలంటూ పాల క్యాన్ల‌తో మదర్ డెయిరీ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

విధాత : తెలంగాణ రాష్ట్రంలో అసలే పాల వినియోగానికి..ఉత్పత్తికి మధ్య అంతరం చాల పెరిగిపోతుంది. ప్రభుత్వాలు పాడి పోషణను ప్రొత్సహించాల్సింది పోయి..రైతులే స్వచ్చందంగా వ్యయప్రయాసలతో ఆవులు, గేదెలు పెంచుకుని ప్రభుత్వ రంగ పాల డెయిరీలకు పాలు పోస్తే..వారికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం విమర్శల పాలవుతుంది. రాష్ట్ర బడ్జెట్ లో పాల రైతులకు ఇవ్వాల్సిన బిల్లులు..ప్రోత్సహాకాలు చాల చిన్న విషయం. అయినా ప్రభుత్వం పాల రైతులకు బిల్లులు పెండింగ్ లో పెట్టడం పాడి రైతుల్లో అసహనాన్ని రగిలిస్తుంది. దీంతో తమ పెండింగ్ బిల్లుల(milk bill pending dues) కోసం తరచూ పాడి రైతులు రొడ్డెక్కుతున్నారు. తాజాగా భువనగిరి మదర్ డెయిరీ రైతులు(Bhuvanagiri Mother Dairy) తమకు రావాల్సిన పాల పెండింగ్ బిల్లుల చెల్లించాలంటూ పాల క్యాన్ల‌తో మదర్ డెయిరీ ఎదుట రోడ్డుపై ఆందోళన(farmers protest)కు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇక్కడి డెయిరీ పరిధిలోని ఒక్క వీరవెల్లి గ్రామానికి చెందిన 120 మంది రైతులకే రూ.24 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. ఇలాగే డెయిరీ పరిధిలోని గ్రామాల పాడి రైతులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. ఎన్నిసార్లు పెండింగ్ బిల్లుల కోసం మొర పెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని..దీంతో తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అధికారులు జీతాలు తీసుకుంటున్నట్లుగానే..మా పాల బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. మదర్ డెయిరీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. వెంటనే ప్రభుత్వం, మదర్ డెయిరీ పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పశుపోషణ భారమైన పరిస్థితుల్లో బిల్లుల పెండింగ్ తో తాము మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.