- 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు
- దరఖాస్తుల స్వీకరణ.. వాటి పరిష్కారం
- రైతుల సందేహాలకు అర్థమయ్యే భాషలో నివృత్తి
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, (విధాత): భూభారతి చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాకోణంలో తీసుకువచ్చిన ఈ భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృతస్ధాయిలో అవగాహన కల్పించడంతోపాటు సంబంధిత మండలాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్లు రెవెన్యూ సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమయ్యే భాషలో వివరించి, పరిష్కారం చూపాలని కోరారు. తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. కుట్ర పూరితంగా, దురుద్దేశంతో తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్‌తో ప్రజలు అవస్థలు పడి జీవితాలను ఆగమాగం చేసుకున్నారని, గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండదండలుగా నిలవడంతో వందల రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఆలోచనలకు భిన్నంగా గత పదేండ్లలో రాష్ట్రంలో భూ హక్కుల విధ్వంసం జరిగి రెవెన్యూ సేవలు దుర్భరంగా మారాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రైతు కళ్లల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని వివరించారు. ప్రజలు , ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో విజయవంతంగా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యపై కోర్టుకెళ్లడం తప్ప మరో మార్గం ఉండేదికాదని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
భూ భారతి అమలుకానున్న 28 మండలాలు
ఆదిలాబాద్ : భరోజ్, భద్రాద్రి కొత్తగూడెం : సుజాతనగర్, హనుమకొండ : నడికుడ, జగిత్యాల : బుగ్గారం, జనగామ : ఘన్‌పూర్, జయశంకర్ భూపాలపల్లి : రేగొండ, జోగులాంబ గద్వాల్ : ఇటిక్యాల్, కరీంనగర్ : సైదాపూర్, కొమరంభీం ఆసిఫాబాద్ : పెంచికల్‌పేట్, మహబూబాబాద్ : దంతాలపల్లి, మహబూబ్ నగర్ : మూసాపేట్, మంచిర్యాల : భీమారం, మెదక్ : చిల్పిచిడ్, మేడ్చల్ మల్కాజిగిరి : కీసర, నాగర్‌కర్నూల్ : పెంట్లవల్లి, నల్గొండ : నకిరేకల్, నిర్మల్ : కుంటాల, నిజామాబాద్ : మెండోరా, పెద్దపల్లి : ఎలిగేడ్, రాజన్న సిరిసిల్ల : రుద్రంగి, రంగారెడ్డి : కుందుర్గ్, సంగారెడ్డి : కొండాపూర్, సిద్దిపేట : అక్కన్నపేట, సూర్యాపేట : గరిడేపల్లె, వికారాబాద్ : ధరూర్, వనపర్తి : గోపాలపేట, వరంగల్ : వర్దన్నపేట్, యాదాద్రి భువనగిరి : ఆత్మకూర్.
