Cold Wave | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ మంచు కురుస్తుండటంతో.. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. సాయంత్రం ఆరింటికే చలి తీవ్రత పెరిగిపోతోంది. రాబోయే మూడు రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వెచ్చని దుస్తులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం రోజు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇవాళ హైదరాబాద్ నగరంలో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బుధవారం నగరంలో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2012లో ఇదే సమయంలో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లిలో బుధవారం 8.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.