మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కూటమి పార్టీల షాకులు

ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే

  • Publish Date - December 30, 2023 / 11:45 AM IST
  • పంజాబ్‌లో ఆప్‌ ఒంటరి పోటీ
  • మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌) కూడా
  • బెంగాల్‌లో బీజేపీని తానే ఢీకొంటానన్న మమత


న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. మూడు కీలక రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. పంజాబ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది.


తాజాగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగా ఢీకొంటామని తేల్చేశారు. మరోవైపు మహారాష్ట్రలో తమకు 23 సీట్లు కావాలని శివసేన (ఉద్ధవ్‌) పట్టుబడుతుండటంతో సీట్ల సర్దుబాటు చర్చలకు అడ్డంకి ఏర్పడింది. ఈ మూడు రాష్ట్రాల్లో తమకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆయా పార్టీలు చెబుతున్నాయి.


గురువారం ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన మమతాబెనర్జీ.. ‘దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఉంటుంది. కానీ.. బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసి, బీజేపీని ఓడిస్తుంది. గుర్తుంచుకోండి.. బీజేపీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రమే బీజేపీకి గుణపాఠం చెప్పగలదు. అది వేరెవ్వరికీ సాధ్యంకాదు’ అని చెప్పారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌, వామపక్షాలతో సీట్ల సర్దుబాటు అనేది ఉండదని మమత తన మాటల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టయింది.


2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో వామపక్షాలతో పొత్తుకు రాష్ట్ర నాయకులలో ఎక్కువ మంది ఒత్తిడి చేసినా కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 42 లోక్‌సభ సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్‌ 2 మాత్రమే గెలుచుకోగలిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 సీట్లు గెలుపొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు సీట్లు ఇస్తే ఉపయోగం లేదనే అభిప్రాయంతో తృణమూల్‌ అధినేత్రి ఉన్నట్టు చెబుతున్నారు.


మహారాష్ట్ర కూటమి పార్టీలు మూడు


మహారాష్ట్రలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇండియా కూటమికి శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (పవార్‌)తో కాంగ్రెస్‌ భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఒకప్పుడు తనకు బలమైన రాష్ట్రంగా ఉండిన మహారాష్ట్రలో తన పునాదిని బలోపేతం చేసుకోవాలనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ కనిపిస్తున్నది. రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌ న్యాయ్‌ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగియనున్నది.


ఇదే కాకుండా తన బలాన్ని చాటుకునేందుకు గాను గురువారం కాంగ్రెస్‌ 139వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సైతం నాగపూర్‌లో నిర్వహించారు. కానీ.. శివసేన (ఉద్ధవ్‌) మాత్రం 23 సీట్లు కోరితే.. అందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది. శివసేన డిమాండ్‌ ‘అతి’గా ఉన్నదని కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ పేర్కొన్నారు. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.


అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటున్నా.. ప్రస్తుత పరిస్థితిలో శివసేన (ఉద్ధవ్‌) 23 సీట్లు కోరడం అతిగా ఉన్నదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. 48 సీట్లకుగాను కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించగా.. ఎన్సీపీ 4 స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ 23 సీట్లలో, శివసేన 18 సీట్లలో గెలిచాయి.


ఆప్‌ సైతం ఒంటరి మంత్రం


పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. డిసెంబర్‌ 26న అధిష్ఠాన పెద్దలతో జరిగిన సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వం వ్యక్తం చేసిందని సమాచారం. దాదాపు 30 మంది పాల్గొన్న కాంగ్రెస్‌ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశషంలో సీట్ల సర్దుబాటు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను పరిరక్షిస్తామని అధిష్ఠానం తమకు హామీ ఇచ్చిందని పంజాబ్‌ సీఎల్పీ నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా తెలిపారు.


ఇది అంతర్గత సమావేశమైనందున మరిన్ని వివరాలు వెల్లడించలేనని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అధికార ఆప్‌ కూడా ఒంటరిగానే పోటీ చేస్తామన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇటీవల పంజాబ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడి ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆప్‌నే గెలిపించాలని పిలుపునివ్వడం ద్వారా తాము పొత్తులకు సిద్ధంగా లేమన్న సంకేతాలు ఇచ్చారు.


గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇక్కడ 8 సీట్లలో గెలుపొందింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అకాలీదళ్‌, బీజేపీ చెరో రెండు సీట్లు గెలిచాయి. ఆప్‌ ఒక చోట విజయం సాధించింది. అయితే.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఆప్‌ ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చింది.