Nalgonda: కాంగ్రెస్ నల్గొండ నిరుద్యోగ దీక్ష వాయిదా.. రేవంత్‌కు వ్యతిరేకంగా బహిర్గతమైన వర్గ పోరు

మరోసారి రేవంత్‌కు వ్యతిరేకంగా బహిర్గతమైన కాంగ్రెస్ వర్గ పోరు!! విధాత: కాంగ్రెస్ పార్టీ ఈనెల 21న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమాన్ని టిపిసిసి వాయిదా వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుండి అభ్యంతరాల నేపథ్యంలో దీక్ష వాయిదా వేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్లుగా ఉన్న ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఆర్. దామోదర్ రెడ్డిలకు సమాచారం లేకుండా ఈనెల 21న నిరుద్యోగ దీక్ష […]

  • Publish Date - April 19, 2023 / 02:28 PM IST

  • మరోసారి రేవంత్‌కు వ్యతిరేకంగా బహిర్గతమైన కాంగ్రెస్ వర్గ పోరు!!

విధాత: కాంగ్రెస్ పార్టీ ఈనెల 21న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమాన్ని టిపిసిసి వాయిదా వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుండి అభ్యంతరాల నేపథ్యంలో దీక్ష వాయిదా వేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.

ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్లుగా ఉన్న ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఆర్. దామోదర్ రెడ్డిలకు సమాచారం లేకుండా ఈనెల 21న నిరుద్యోగ దీక్ష కార్యక్రమాన్ని ప్రకటించడం పట్ల వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి బాహటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నల్గొండ నిరుద్యోగ దీక్షకు సంబంధించి ఎలాంటి సమాచారం నాకు లేదని, సమాచారం లేనప్పుడు వెళ్ళేది లేనిది ఎలా చెబుతానంటూ ఆయన మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి.

జిల్లా కాంగ్రెస్ నాయకులతో చర్చించకుండా ఏకపక్షంగా నిరుద్యోగ దీక్ష సభ ప్రకటించడం సరికాదని ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా విజయవంతం చేస్తామని, ప్రియాంక గాంధీ సభకు అయితే తాము సిద్ధమవుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఉత్తమ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు, సీనియర్లకు మధ్య నెలకొన్న విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను ఢిల్లీలో ఉన్నందున నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షకు రాలేనన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీపీసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ల మధ్య సమన్వయ లోపం, వర్గ పోరు, విభేదాల నేపథ్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష వాయిదా పడిన తీరు కాంగ్రెస్ అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారింది.

గతంలో రేవంత్ పాదయాత్ర ఖమ్మం నుంచి సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు రావాల్సి ఉండగా జిల్లా కాంగ్రెస్ సీనియర్లతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయన పాదయాత్రను ఆదిలాబాద్, నిజామాబాద్ కు మళ్లించుకోవాల్సింది. జిల్లా కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌, ఆర్. దామోదర్ రెడ్డిలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పర్యటనను పదేపదే వ్యతిరేకిస్తున్న తీరు ఆ పార్టీలో సీనియర్లకు, రేవంత్ కు మధ్య జరుగుతున్న అధిపత్య పోరును చాటింది.

ఒకవైపు బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ మార్చ్ లతో బిజెపి రాజకీయంగా దూసుకెళుతుండగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అంతర్గత కలహాలతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో వెనుకబడుతుండటం ఆ పార్టీ క్యాడర్ ను నిరుత్సాహపరుస్తుంది.

Latest News