Site icon vidhaatha

టీఆర్ఎస్‌, బీజేపీ క‌లిపి ప‌న్నిన కుట్ర: పాల్వాయి స్ర‌వంతి

విధాత‌: మంగళవారం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షో ఉన్న నేపథ్యంలో న‌ల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ కార్యాల‌యంలోని పార్టీ జెండాలు, వాల్‌ పోస్ట‌ర్ల‌కు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నిప్పు అంటించారు. సిద్ధం చేసిన సామాగ్రికి నిప్పు పెట్ట‌డం హేయ‌మైన చ‌ర్య‌గా పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు.

రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు పార్టీ కార్యాల‌యంలోనే ఉన్నామ‌ని, పొద్దున వ‌చ్చే స‌రికి సామ‌ను ఉంచి గ‌ది నుంచి పొగ‌లు రావ‌డంతో పోలీసులు విద్యుత్ శాఖ వారికి స‌మాచారం అందించామ‌న్నారు. పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేశారు.

చండూరు పార్టీ కార్యాల‌యాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ద‌గ్ధం చేసిన ఘ‌ట‌న‌పై మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి ఖండించారు. త‌మ‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక దొంగ‌ చాటుగా దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నార‌ని మండి ప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డం స‌రికాద‌ని, ఇలాంటి బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డేది లేద‌ని స్ఫష్టం చేశారు. ఈ మేర‌కు చండూరులో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించి ధ‌ర్నా చేశారు.

టీఆర్ఎస్‌, బీజేపీ క‌లిపి ప‌న్నిన కుట్ర ఇది అని ఆమె ఆరోపించారు. ఆడ‌బిడ్డ‌నైన త‌న‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణను చూసి త‌ట్టుకోలేక, విజ‌యం దిశ‌గా మేము అడుగులు వేస్తున్న త‌మ‌ను అడ్డుకోవ‌డానికి , మా మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌డానికి ఇటువంటి దుశ్చ‌ర్యకు పాల్ప‌డ్డారు. ఇలాంటి వాటికి భ‌య‌ప‌డం. ఇంకా ఉధృతంగా మా ప్ర‌చారాన్ని సాగిస్తాం కానీ వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని స్ర‌వంతి తేల్చిచెప్పారు.

చండూరు పార్టీ కార్యాల‌యాన్ని నిప్పు పెట్టిన‌ ఘ‌ట‌న‌పై రేవంత్‌రెడ్డి స్పందించారు. మ‌నుగోడులో కాంగ్రెస్ పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి ప్ర‌త్య‌ర్థులు త‌ట్టుకోలేక‌ పోతున్నారని, అందుకే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దుర్మార్గ‌పు చ‌ర్య‌ల‌తో మునుగోడు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేర‌ని అన్నారు. దిమ్మెలు కూల్చినా, కార్యాల‌యాలు త‌గుల‌బెట్టినా కాంగ్రెస్ పార్టీదే విజ‌యమ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

Exit mobile version