Site icon vidhaatha

పురుషుల వీర్యంపైనా క‌రోనా ఎఫెక్ట్..! సంతానోత్ప‌త్తికి ఇబ్బందా..?

Men Semen | క‌రోనా మ‌హమ్మారి గ‌త మూడేండ్ల నుంచి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూనే ఉంది. ఈ వైర‌స్ బారిన ప‌డ్డ వారు కోలుకున్న‌ప్ప‌టికీ, వారిని అనేక స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉన్నాయి. సంతానోత్ప‌త్తికి ప్ర‌ధాన కార‌ణ‌మైన‌ పురుషుల వీర్యంపై కూడా క‌రోనా ప్ర‌భావం చూపుతోంద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. వీర్యం పూర్తిగా దెబ్బ‌తింటోంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

సార్స్ కోవ్ -2 వైర‌స్.. వృషణ కణజాలాల్లో ఉండే యాంజియోటెన్సిన్ ఎంజైమ్-2 రిసెప్టర్​ (ఏసీఈ2) ద్వారా వివిధ అవయవాలను దెబ్బతీస్తోందని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఏసీఈ2 అనేది సార్స్ కోవ్-2 స్పైక్ ప్రోటీన్‌ను గ్రహించి.. శరీరంలోని కణజాలాల్లోకి ప్రవేశిస్తోందని పాట్నా ఎయిమ్స్​కు చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది.

30 మంది పురుషుల‌పై అధ్య‌య‌నం..

క‌రోనా ప్ర‌భావం పురుషుల వీర్యంపై ఉందా? లేదా? అనే అంశాన్ని గుర్తించేందుకు, కొవిడ్ సోకిన 30 మంది పురుషుల‌పై నిర్వ‌హించారు. అయితే ఈ ప‌రిశోధ‌న‌ల్లో పాట్నా ఎయిమ్స్ ప‌రిశోధ‌కుల‌తో పాటు, మంగ‌ళ‌గిరి, ఢిల్లీ ఎయిమ్స్ ప‌రిశోధ‌కులు కూడా భాగ‌స్వాముల‌య్యారు. వీర్యం నాణ్య‌త‌, జ‌న్యు ప‌దార్థంపై క‌రోనా వైరస్ ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌నే విష‌యంపైనే ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఈ అధ్య‌య‌నాన్ని 2020, అక్టోబ‌ర్ నుంచి 2021, ఏప్రిల్ వ‌ర‌కు నిర్వ‌హించారు. కొవిడ్ సోకిన 30 మందిపై రియ‌ల్ టైమ్ రివ‌ర్స్ ట్రాన్‌స్క్రిప్టెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేష‌న్ ఇండెక్స్‌ను ప‌రిశీలించారు.

చాలా త‌క్కువ‌గా వీర్యం ప‌రిణామం, శుక్ర‌క‌ణాలు

74 రోజు త‌ర్వాత ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే వీర్యం పరిమాణం, చలనశీత, శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, శుక్ర కణాల్లో లోపాలు అధికంగా కనిపించినట్లు వెల్లడైంది. దీంతోపాటు తెల్ల రక్తకణాలు, ల్యూకోసైట్లు పెరిగాయని, వీర్యం ద్రవీభవించే సమయం సైతం పెరిగిందని పరిశోధన బృందం తెలిపింది. రెండోసారి పరీక్షలు చేసే సమయానికి ఫలితాలు మారిపోయాయని, అయితే సాధారణ స్థాయికి మాత్రం రాలేదని పరిశోధకులు వివరించారు. ఈ నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఫలితం నెగెటివ్​గా వచ్చిందని చెప్పారు. కరోనా వల్ల వీర్యం నాణ్యత దెబ్బతిన్నప్పటికీ.. దీని వల్ల పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం ఉంటుందా అనేది తెలియలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు క్యూరెయస్ మెడికల్ సైన్స్​ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

Exit mobile version