దుబాయ్ (Dubai) అంటేనే లగ్జరీకి పెట్టింది పేరు. ఎక్కడ చూసిన ఎత్తైన భవనాలు, కళ్లు చెదిరే భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచంలోని ఎన్నో వింతలకు దుబాయ్ ఓ వేదిక అని చెప్పొచ్చు. టూరిస్ట్‌లను ఆకట్టుకునేందుకు దుబాయ్ పాలకులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భవనాలు నిర్మిస్తుంటారు. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు తాజాగా దుబాయ్ ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టును మొదలు పెట్టబోతోంది.
ఇక దుబాయ్ ఎత్తైన కట్టడాలకే కాదు.. బంగారానికి కూడా కేరాఫ్ అడ్రెస్. ‘సిటీ ఆఫ్ గోల్డ్’గా దుబాయ్ ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో బంగారం, ఆభరణాలకు అంతర్జాతీయ కేంద్రంగా దుబాయ్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. కొత్తగా దుబాయ్ ‘గోల్డ్ డిస్ట్రిక్ట్’ (Dubai Gold District)ను నిర్మించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బంగారు దుకాణాలతో కూడిన వీధిని దుబాయ్‌లో నిర్మించనున్నారు. ఇప్పటికే బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన దుబాయ్‌లోని డీరా (Deira) ప్రాంతంలో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ వీధి మొత్తం పూర్తిగా బంగారం (Gold Street)తో తయారు అవుతుందట.
దుబాయ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు బంగారం, ఆభరణాలు ఒకేచోట లభించేలా ఈ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కొత్త డిస్ట్రిక్ట్‌లో రిటైల్ దుకాణాలు, బులియన్ (బంగారు కడ్డీలు), పెట్టుబడి, ఆభరణాలకు సంబంధించిన ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. దాదాపు వెయ్యికిపైగా దుకాణాలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. బంగారం దుకాణాలతోపాటూ లైఫ్‌స్టైల్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్‌కు సంబంధించిన దుకాణాలు కూడా ఇక్కడ పర్యాటకులను ఆకర్షించనున్నాయి. దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET), దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) కింద పనిచేసే ఇత్రా దుబాయ్ ఈ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు వంటి వివరాలను విడతల వారీగా వెల్లడించనున్నారు. ఈ గోల్డ్ స్ట్రీట్ అందుబాటులోకి వస్తే మాత్రం దుబాయ్ పర్యాటకం మరింత పరుగులు పెడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Silver Gold Price Today : వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు
Jamili Elections | మహిళలు.. వారసులు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంకండి!
