విధాత : మూసీ జలాలతో పారాల్సిన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బునాదిగాని కాలువలోకి ఎక్కడో సూదూర ప్రాంతం నుంచి తరలివస్తున్న గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం భువనగిరి జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ అద్బుత ఘట్టానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారం కావడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని భువనగిరి బస్వాపురం రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం బునాదిగాని చెరువులోకి వస్తున్నాయి.
కలుషిత మూసీ జలాల స్థానంలో గోదావరి జలాలు
బస్వాపురం రిజర్వాయర్ నుంచి కొనసాగే కాళేశ్వరం(గతంలో ప్రాణహిత-చేవేళ్ల ) కాలువ నుంచి ఎర్రంబెల్లి వద్ద బునాదిగాని కాలువకు లింక్ ఏర్పాటు చేయడంతో గోదావరి జలాలు ఈ కాలువ పరిధిలోని చెరువులకు సరఫరా అవుతున్నాయి. దీంతో కలుషిత మూసీ జలాల స్థానంలో గోదావరి జలాలు బునాదిగాని కాలువ పరిధిలోని రైతాంగానికి అందుబాటులోకి రావడం విశేషం. ఇప్పటిదాక కాలుష్యకారక మూసీ జలాలపై ఆధారపడిన రైతులు ఇప్పుడు స్వచ్చమైన గోదావరి జలాలతో పంటల సాగు చేసుకునే భాగ్యం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూసీ జలాల వినియోగంతో పలురకాల రోగాలు వ్యాప్తి చెంది మత్స్య, పాడి పశువుల పోషణలో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా గోదావరి జలాల రాక ప్రయోజనకరం కానుంది.
సుదీర్ఘ పోరాటాల ఫలం..సాకారమైన రైతాంగం స్వప్నం
ఒకప్పుడు బువ్వ మానైనా సరే బునాదిగాని కాలువ సాధిద్దాం అన్న నినాదంతో ఈ కాలువ పరిధిలోని రైతాంగం మూసీ జలాల సాధన కోసం ఉద్యమించింది. సుదీర్ఘ ఉద్యమాలకు దిగొచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.పురుషోత్తంరెడ్డి, జిల్లా మంత్రి కె. జానారెడ్డి చొరవతో బునాదిగాని కాలువను మంజూరు చేసింది. నాడు చిన్ననీటిపారుదల శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తొలిదశ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. బీబీనగర్ మండలం మక్తానంతరం నుంచి పహిల్వాన్ పురం బునాదిగాని కాలువ వరకు తొలి దశ పనులు సాగాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ కాలువను ఆత్మకూర్, మోత్కూర్, అడ్డగూడురు మండలాల వరకు పొడిగించాయి.ఇన్నాళ్లుగా మూసీ జలాలే కాలువ పరిధిలోని రైతులకు ఆధారంగా సాగాయి.
పుష్కరాల ముంగిట కదలివచ్చిన గోదారమ్మ
మూసీ జలాల ఆధారిత బునాదిగాని కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు ఇప్పుడు
గోదావరి జలశోభను సంతరించుకోనున్నాయి. రానున్న గోదావరి పుష్కరాల వేళకు ముందే గోదారమ్మ మమ్మల్ని కరుణించిందంటూ బునాదిగాని కాలువ ఆయకట్టు గ్రామాల రైతాంగం మురిసిపోతుంది. బునాదిగాని చెరువులోకి వస్తున్న గోదావరి జలాలను చూసిన రైతులు ఆనందోత్సహాలతో పులకరించారు.
గోదావరి జలాల ఘనతపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పొటాపోటీ ప్రచారాలు
బునాదిగాని కాలువ పరిధిలోని చెరువులకు గోదావరి జలాలు అందడం..బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైందని..ఇది కేసీఆర్ ఘనత అని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.కేసీఆర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు బస్వాపురం కాలువకు బునాదిగాని కాలువను లింక్ చేసి గోదావరి జలాలను అందించడం మా ప్రభుత్వం ఘనతనే అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. స్థానిక భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు, గోదావరి జలాభిషేకాలు చేస్తున్నారు. అనిల్ కుమార్ రెడ్డి రూ.240కోట్లతో ప్రాణహిత చేవేళ్ల(కాళేశ్వరం) కాలువ పనులు పూర్తి చేయించి..హైదరాబాద్ – వరంగల్ హైవే వద్ద రోడ్డు కట్ చేసి, ఆరునెలల్లో కల్వర్టు నిర్మాణం జరిపించి బునాదిగాని కాలువకు గోదావరి జలాలను లింక్ చేశారని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా బునాదిగాని కాలువ పరిధిలోని చెరువులు, కుంటలకు గోదావరి జలాల సరఫరా అందించిన ఘనత మాదంటే మాదేనంటూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటుండటం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఇవి కూడా చదవండి :
గుర్తుంచుకోండి: ఏప్రిల్ 1 నుంచి ఆదాయ పన్నులో కొత్త లెక్కలు.. ₹12 లక్షల వరకు టాక్స్ లేదు
LPG Gas ATM : గ్యాస్ పంపిణీకి ఎల్పీజీ ఏటీఎంలు!
