కాళేశ్వరంపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈనెల 31న ఎన్డీఎస్‌ఏ సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు నిర్ణయిస్తామని తెలిపారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 29, 2026, 6:25 pm IST
Read Time: 5 mins
కాళేశ్వరంపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు : మంత్రి ఉత్తమ్

బీఆర్ ఎస్ హయాంలోనే నాణ్యత  లోపాలతో కూలిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌, ఆ పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ పాలకులు నాసిరకం డిజైన్, నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం కట్టారని.. వారు సరిగా కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని మండిపడ్డారు. బ్యారేజీలో 2 లేదా 3 టీఎంసీలు నిల్వ చేయమంటున్న బీఆర్ఎస్ నాయకులు గతంలో  10 టీఎంసీలు ఎందుకు స్టోర్‌ చేశారని ప్రశ్నించారు.  కేటీఆర్ కంటే తెలివైన మేధావులు తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. తమకు కాళేశ్వరం సహా రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఈనెల 31న ఎన్డీఎస్‌ఏ సమావేశం

కాళేశ్వరంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వంతో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఎన్డీఎస్‌ఏ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, నీటి నిల్వ, పంపింగ్ అంశాలపై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గేట్లు ఎత్తిపెట్టి ఫ్రీ ఫ్లోగా ఉండాలనే విషయాన్ని ఎన్డీఎస్ఏ అధికారులు స్పష్టం చేశారని అన్నారు.  కాపర్ డ్యాం కట్టాలా, వద్దా అని ఎన్డీఎస్ఏ అధికారుల సలహా ప్రకారమే నడుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మూడు బ్యారేజ్‌లను టెస్టింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబే, ఆఫ్రో ఇండియాతో రిహబిలిటేషన్ డిజైన్స్ వర్క్ పూర్తి చేస్తామని వెల్లడించారు. నిపుణుల సాయంతో వీలైనంత త్వరగా బ్యారేజీ మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు.

హైడ్రాకు నాకు సంబంధం లేదు

హైడ్రాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని..దానికి సంబంధించిన ప్రశ్నలను నన్ను అడగవద్దని, అది సీఎం రేవంత్ రెడ్డి శాఖ పరిధిలోకి వస్తుందని..దానిపై ఏదైనా ఆయననే అడగాలని మీడియాకు ఉత్తమ్ స్పష్టం చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హైడ్రాపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత తాను మాట్లాడటం సబబు కాదని చెప్పుకొచ్చారు. మున్సిపల్ శాఖ సీఎం పరిధిలోనే ఉందని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ స్పష్టం చేశారు.