Cough Syrup | ఆ భారత దగ్గు మందు కలుషితం.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Cough Syrup | భారత్‌కు చెందిన మరో దగ్గు సిరప్‌ నాణ్యతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. సదరు సిరప్‌ కలుషితమని పేర్కొంటూ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియాలో భారతీయ కంపెనీకి చెందిన దగ్గు సిరప్ కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే, ఏదైనా ప్రాణనష్టం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తెలుపలేదు. గ్వైఫెనెసిన్ సిరప్ టీజీ సిరప్‌తో పాటు డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ స్వల్ప […]

  • Publish Date - April 26, 2023 / 04:31 AM IST

Cough Syrup |

భారత్‌కు చెందిన మరో దగ్గు సిరప్‌ నాణ్యతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. సదరు సిరప్‌ కలుషితమని పేర్కొంటూ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియాలో భారతీయ కంపెనీకి చెందిన దగ్గు సిరప్ కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అయితే, ఏదైనా ప్రాణనష్టం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తెలుపలేదు. గ్వైఫెనెసిన్ సిరప్ టీజీ సిరప్‌తో పాటు డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ స్వల్ప మొత్తాల్లో గుర్తించినట్లు పేర్కొంది. దీని వినియోగం మానవ జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది.

అయితే, ఈ రసాయనాలను ఆస్ట్రేలియా రెగ్యులేటర్‌ గుర్తించి.. ఈ నెల 6న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

అయితే, డబ్ల్యూహెచ్‌ఓ నుంచి మెయిల్స్‌ వచ్చిన తర్వాత.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని హర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలకు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్‌ లిమిటెడ్‌ ఈ దగ్గు మందును ఉత్పత్తి చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే, దేశాల్లో సరఫరా కోసం హర్యానాలోని ట్రిలియం ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకుంది.

ఈ మందును వినియోగించొద్దని సభ్య దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దగ్గు మందు భద్రత, నాణ్యతపై రెండు కంపెనీలు ఎలాంటి హామీ ఇవ్వలేదని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో తయారైన దగ్గు మందులపై గతంలోనూ పలు ప్రశ్నలు సంధించింది.

భారత్‌లో తయారైన సిరప్‌లతో గాంబియా, ఇండోనేషియా, ఉబ్జెకిస్థాన్‌లో దాదాపు 300 మందికిపైగా పిల్లల్లో కిడ్నీలు దెబ్బతిని మృతి చెందినట్లుగా పేర్కొంది. తాజాగా ప్రశ్నలు లేవనెత్తిన సిరప్‌ భారత్‌ నుంచి కంబోడియాకు మాత్రమే ఎగుమతి చేసేందుకు అనుమతి ఉందని, ప్రస్తుతం మార్షల్‌ దీవులు, మైక్రోనేషియా ఎలా చేరాయి? అనే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ దగ్గు మందు భారత మార్కెట్లలోనూ అందుబాటులో ఉంది.

Latest News