విధాత: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల (worlds most powerful passports) జాబితా విడుదలైంది. ఈ జాబితాలో సింగపూర్ (Singapore) తొలి స్థానంలో నిలిచింది. ఇక భారత్ (India) 80వ స్థానంలో ఉంది. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index 2026) ఏటా ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈ ఏడాది కూడా శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 199 దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను ప్రకటించింది.
వరుసగా మూడోసారి సింగపూర్..
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో సింగపూర్ (Singapore) వరుసగా మూడో ఏడాది కూడా తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్టుతో 192 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. ఇక సింగపూర్ తర్వాత జపాన్, దక్షిణ కొరియా దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో దాదాపు 188 దేశాలను వీసా లేకుండానే చుట్టేయొచ్చు. డెన్మార్క్, లక్సెంబర్గ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులు కలిగిన వారు 186 గమ్యస్థానాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలు ఉంది. ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నార్వే దేశాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 185 దేశాలను వీసా లేకుండానే చుట్టేయొచ్చు. హంగరీ, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా , యూఏఈ దేశాలు ఐదో స్థానం నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 184 దేశాలను చుట్టేయొచ్చు.
క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, మాల్టా, న్యూజిలాండ్, పోలాండ్ దేశాలో ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండానే 183 దేశాల్లో తిరగొచ్చు. ఆస్ట్రేలియా, లాట్వియా, లీచ్టెన్‌స్టెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్ 182 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలవగా.. కెనడా, ఐస్లాండ్, లిథువేనియా దేశాలు 181 స్కోర్‌తో ఎనిమిదిఓ స్థానంలో ఉన్నాయి. మలేషియా (180) తొమ్మిదో స్థానంలో, ఇక అగ్రరాజ్యం అమెరికా 179 స్కోరుతో 10వ స్థానంలో నిలిచాయి.
భారత్ ర్యాంక్
ఇక భారత్ విషయానికొస్తే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ గతేడాదితో పోలిస్తే కాస్త దిగజారింది. 2025 జాబితాలో భారత్ 77వ స్థానంలో నిలివగా.. ఇప్పుడు మూడు పాయింట్లు దిగజారి 80వ స్థానానికి చేరింది. వీసా రహితంగా (Visa Free Entry) ప్రయాణించగల దేశాల సంఖ్య గతేడాది 59గా ఉండగా.. ఇప్పుడు 55కి తగ్గింది. మలేసియా, ఇండోనేసియా, మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తుండగా, శ్రీలంక, మకావు, మయన్మార్ వంటి కొన్ని దేశాలు భారతీయులకు వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. నైజీరియా, అల్జీరియా కూడా భారతదేశంతో సమాన స్థానాన్ని పంచుకున్నాయి. ఇక ఈ జాబితా బంగ్లాదేశ్ 95వ స్థానంలో నిలవగా.. దాయాది పాకిస్థాన్ 98వ స్థానంలో ఉంది. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా దేశాలో చిట్టచివరి స్థానాన్ని దక్కించుకున్నాయి.
