Crocodile | మొస‌లి క‌న్నీరు కాదు.. వాటి గుండె త‌డిని చూడండి

విధాత‌: చూడ‌గానే మ‌న‌కు ఒళ్లు జ‌ల‌ద‌రించే జీవి మొస‌లి (Crocodile). దాని ప‌దునైన ప‌ళ్లు, మొర‌టుగా ఉండే శ‌రీరం, వేటాడటంలో క్రూర‌త్వం.. ఇలా అన్నీ మ‌న‌కు భ‌యంగొలిపేవే.. అయితే వాట‌న్నింటి మాటున ఓ మంచి అమ్మ హృద‌యం ఉంద‌ని ప‌రిశోధ‌కులు ఇటీవ‌ల గుర్తించారు. పిల్ల‌ల కోసం ఎంత‌కైనా… అన్ని స‌రీసృపాల్లాగే మొస‌లి కూడా అది ఉంటున్న త‌టాకం ఒడ్డున ఒక గొయ్యి తీసి, గుడ్ల‌ను పెడుతుంది. త‌న తోటి స‌రీసృపాలైన పాములు, తాబేళ్లు గుడ్లను పెట్టి వెళిపోతే.. […]

  • Publish Date - May 24, 2023 / 06:17 AM IST

విధాత‌: చూడ‌గానే మ‌న‌కు ఒళ్లు జ‌ల‌ద‌రించే జీవి మొస‌లి (Crocodile). దాని ప‌దునైన ప‌ళ్లు, మొర‌టుగా ఉండే శ‌రీరం, వేటాడటంలో క్రూర‌త్వం.. ఇలా అన్నీ మ‌న‌కు భ‌యంగొలిపేవే.. అయితే వాట‌న్నింటి మాటున ఓ మంచి అమ్మ హృద‌యం ఉంద‌ని ప‌రిశోధ‌కులు ఇటీవ‌ల గుర్తించారు.

పిల్ల‌ల కోసం ఎంత‌కైనా…

అన్ని స‌రీసృపాల్లాగే మొస‌లి కూడా అది ఉంటున్న త‌టాకం ఒడ్డున ఒక గొయ్యి తీసి, గుడ్ల‌ను పెడుతుంది. త‌న తోటి స‌రీసృపాలైన పాములు, తాబేళ్లు గుడ్లను పెట్టి వెళిపోతే.. త‌ల్లి మొస‌లి మాత్రం ఆ చుట్టు ప‌క్క‌లే న‌క్కి ఉంటుంది.

ఏదైనా జీవి ఆ గొయ్యి ద‌రిదాపుల్లోకి వ‌స్తే అదే దానికి చివ‌రి రోజు అన్న‌ట్లు. ఆ స‌మ‌యంలో త‌ల్లి మొస‌లి మ‌హా ఉద్రేకంతో కాప‌లా ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. అనంత‌రం గుడ్లు చిన్న చిన్న‌గా ప‌గులుతూ వ‌చ్చే శ‌బ్దాలు ఎక్క‌డో ఉన్న తల్లికి తెలిసిపోతాయి.

అంతే.. వెంట‌నే అక్క‌డికి చేరుకుని.. బుల్లి మొస‌ళ్లు ఆ గుడ్ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి సాయం చేస్తుంది. ఎంతో ప‌దునైన త‌న ప‌ళ్ల‌తో సున్నితంగా ఒక్కో బుల్లి పిల్ల‌నూ తీసుకుని త‌ను ఈదే ప్రాంతంలో చేరుస్తుంది. ఈ త‌తంగంలో తండ్రి మొస‌లి ఏం చేస్తుంద‌నే సందేహం రావొచ్చు. అయితే చాలా మ‌గ మ‌స‌ళ్లు పిల్ల‌ల పెంప‌కంలో ఏ పాత్రా పోషించ‌వు. విచిత్రంగా భార‌త్‌లోని మ‌గ మొస‌ళ్లు మాత్రం త‌మ పిల్ల‌ల‌తో ఎక్కువ సేపు గ‌డిపుతూ.. పెంప‌కంలో త‌ల్లికి సాయ‌ ప‌డ‌తాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

ఏమిటి కార‌ణం..

పాములు, తాబేళ్లు, బ‌ల్లుల వంటి తోటి స‌రీసృపాల వ‌లే కాకుండా పిల్ల‌ల విష‌యంలో మొస‌ళ్లు ఎందుకు విభిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తాయ‌ని సందేహం రావొచ్చు. ఇవి పేరుకు స‌రీసృపాలే కానీ.. వీటి ద‌గ్గ‌రి బంధువులు డైనోసార్లు, అంత‌రించిపోయిన భారీ ప‌క్షులు. డైనోసార్లు ఇలానే తమ సంతానం ప‌ట్ల అమిత శ్ర‌ద్ధ పెట్టేవ‌ని ప‌రిశోధ‌కుల అభిప్రాయం. ఇక ప‌క్షుల సంగ‌తి మ‌నం గ‌మ‌నిస్తున్న‌దే.. కాబట్టి ఆ ల‌క్ష‌ణాలే మొస‌ళ్లూ పుణికి పుచ్చుకున్నాయ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.

మాన‌వుని చ‌ర్య‌ల వ‌ల్ల అన్ని జీవుల మ‌ల్లే వీటి ఉనికీ ప్ర‌మాదంలో ప‌డింది. మారుతున్న ప‌రిస్థితుల ప్ర‌కారం.. వీటితో క‌లిసే మ‌నం జీవించే కాలం రావొచ్చు. వీటికి ఇంత మంచి హృద‌యం కూడా ఉంద‌ని తెలిశాక‌.. ఆ ఊహ అంత భ‌యంకరంగా అయితే లేదు క‌దా..!

Latest News