విధాత : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఏపీలో మంగళవారం తీరం దాటనున్నది. తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్‌గా మారిన మిచౌంగ్ తుఫాన్ మంగళవారం ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. తీవ్ర తుఫాన్ నెల్లూరు నుంచి మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. పాండిచ్చేరికి ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 320 కి.మీ దూరంలో తీరం దాటనుంది.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో ఒడిశా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా రాష్ర్టాల అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
’మిచాంగ్’’ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారిందని, 8 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు దూసుకొస్తోందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. డిసెంబర్ 6 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించామన్నారు. ఉత్తర కోస్తా, తమిళనాడు మరియు ఏపీ, యానాంలో రెడ్ అలర్ట్ జారీ చేశామని మృత్యుంజయ్ మహపాత్ర పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా సుమారుగా 150 ట్రైన్స్ రద్దు చేశారు. ట్రైన్స్ రద్దు అవడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
రైల్వే స్టేషన్లలోని 6 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ఒక్కొక్క పాయింట్‌లో ముగ్గురు టీసీలను రైల్వే యంత్రాంగం ఏర్పాటు చేసింది. హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రయాణికులకు రైల్వే అధికారులు సమాచారం అందిస్తున్నారు. చెన్నై , తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల , చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిఫండ్ చేస్తామని రైల్వే యంత్రాంగం తెలిపింది.తుఫాన్ సహాయక చర్యలలో భాగంగా ఏపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది.
క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ మిచాంగ్ తుపానుపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తుఫాన్ సహాయక చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్లకు తక్షణ సహాయక చర్యల కోసం 2కోట్ల నిధులను సీఎం జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ధాన్యం నీటి పాలవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో ఎన్నో తుఫాన్లను చూసిన అనుభవంతో అధికార యంత్రాంగం, ప్రజలు మిచౌంగ్ తుఫాన్‌ను ఎదుర్కోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంత వాసులను పునరావాస క్యాంపులకు తరలించి సహాయక చర్యలు అమలు చేయాలని తెలిపారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు అందించాలని, నష్టంపై నివేదికలు రూపొందించాలని తెలిపారు. ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మంగళ, బుధవారం వరకు వానలు తప్పవని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడవచ్చని తెలిపింది.