DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. అదనపు విడతర డియర్‌నెస్ అలవెన్స్ విడుదలకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని నాలుగుశాతం పెంచింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ విడుదలకు కేమినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 47.58లక్షల మంది ఉద్యోగులు, 69.76లక్షల పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
తాజా పెంపుతో ప్రస్తుతం డీఏ 42శాతానికి చేరింది. తాజాగా డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.12,815కోట్లు భారం పడుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్రం డీఏను పెంచుతుంది.
వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తూ ఉంటుంది. ఏడో వేతనసంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇంతకు ముందు 28 సెప్టెంబర్ 2022లో కేంద్రం కరువు భత్యాన్ని పెంచింది.
అయితే, ఏటా రెండు సార్లు డీఏను కేంద్రం సమీక్షిస్తూ.. సవరిస్తూ ఉంటుంది. సమీక్ష జనవరి, జూలై మాసాల్లో జరుగుతూ ఉంటుంది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రాలు సైతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నాయి.