విధాత: దళిత మహిళను అందరూ చూస్తుండగానే నడివీధిలో పోలీస్ అధికారి లాఠీతో చావబాదిన ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసుల క్రూరత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని సీతామర్హిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ కేసులో ఇరువర్గాల మధ్య గొడవ మొదలడంతో వారిని శాంతింపజేసే క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
సురాసంద్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కిషోర్ సింగ్ వీధిలో మహిళను లాఠీతో దారుణంగా కొట్టాడు. సురాసంద్ మార్కెట్‌లో ఆమెను పలుమార్లు లాఠీతో కోపంగా దాడిచేశాడు. ఆమె తనను కొట్టొద్దు అంటూ వేడుకుంటున్నా వినిపించుకోకుండా తలపై, భుజంపై విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీధిలో పోరాడుతున్న ఇద్దరు మహిళలను విడదీసే క్రమంలో మహిళపై దాడిచేయాల్సి వచ్చిందని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు.
“కిడ్నాప్ కేసులో అమ్మాయిని రక్షించాం. కానీ, ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌కు చేరుకొని బయట గొడవకు దిగాయి. ఇది రహదారిపై ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసు తన లాఠీని ప్రయోగించాడు” అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.