Site icon vidhaatha

Dasyam Vinay Bhaskar | మహిళల అభివృద్ధితో సమాజపురోగతి: చీఫ్ విప్ దాస్యం వినయ్

Dasyam Vinay Bhaskar |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) స్పష్టం చేశారు. తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వయం ఉపాధిని పెంపొందించుకోవాల్సిన అవసరం మహిళలకు ఉందన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశం కల్పించేందుకు తనవంతు ప్రయత్నించేస్తానని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు.

హనుమకొండ డైట్ కాలేజీలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాఫ్ట్ మేళా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రాఫ్ట్స్ ను పరిశీలించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను చూసి ఆయన అబ్బురపడ్డారు. ఒక్కో విద్యార్థి తయారు చేసిన క్రాఫ్ట్ వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులను చీఫ్ విప్ అభినందించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో సత్వర పురోభివృద్ధి సాగుతుందన్నారు. ఏ ఒక్కరిని విస్మరించకుండా సంక్షేమము, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విద్యార్థులు, యువత, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వృత్తి కులాల వారు, మహిళలు అందరిని అభివృద్ధి బాటలో పయనించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఈ కృషి ఫలితంగానే రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమిస్తుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు ఈ క్రాప్టమేలా ఎంతో సంతృప్తినిచ్చిందని తన వంతు సహకారం అందిస్తానని, మరొకసారి ప్రత్యేకంగా వచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతానని దాస్యం హామీ ఇచ్చారు.

చంటి బిడ్డలతో చీఫ్ విప్ దాస్యం

చంటి బిడ్డలతో వచ్చి విద్య నేర్చుకుంటున్న యువతులను చూసి వినయ్ భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు. ఎండాకాలం అయినప్పటికీ పిల్లలతో పాటు వచ్చి చదువు నేర్చుకునేందుకు చూపెడుతున్న పట్టుదలను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారిని ఎత్తుకొని కాసేపు ఆడించారు. విద్యార్థుల వివరాలను, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

సమస్యలు విన్నవించిన విద్యార్థులు

ఈ సందర్భంగా విద్యార్థులు పలువురు తమకున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా నేర్చుకున్న కోర్సు ఉపయోగపడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు గానీ, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించేందుకు సహకరించాలని విన్నవించారు.

దీనిపై ఆయన స్పందిస్తూ తన వంతు మేరకు ప్రయత్నం చేస్తానని మీ కృషిని ఆపకుండా పట్టుదలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. దాదాపు రెండు గంటల పాటు క్రాఫ్ట్ మేళాలో పాల్గొన్నారు. వారు ప్రదర్శించిన కళాత్మక వస్తువులను చూసి ఆనందపడ్డారు.

ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బొమ్మలు, మగ్గం వర్క్, ఇతర చిన్న చిన్న అలంకరణ వస్తువులను ఆయన తిలకించారు. విద్యార్థులు ప్రదర్శించిన సంగీతం అందరిని అలరించింది. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, కార్పొరేటర్లు చెన్నం మధు, వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మిర్యాలకార్ దేవేందర్, విద్యాసాగర్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version