విధాత: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘తీవ్ర’ క్యాటగిరీ కింద నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. ఢిల్లీలో ఏక్యూఐ 447 వద్ద నమోదైందని, ఇది తీవ్రమైన క్యాటగిరీ కిందికి వస్తుందని పేర్కొన్నది.
సున్నా నుంచి 50 మధ్య ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘మంచిది’ . 51 నుంచి 100 ‘సంతృప్తికరమైనది’. 101 నుంచి 200 ‘మితమైనస, 201 నుంచి 300 ‘పేద’, 301 నుంచి 400 ‘చాలా పేలవమైనది’, 401 నుంచి 450 తీవ్రమైన’, 450 పైన అతి తీవ్రమైన క్యాటగిరీ కింద గణిస్తారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో అనవసరమైన నిర్మాణ పనులు, స్టోన్ క్రషింగ్, మైనింగ్‌లను నిషేధించాలని పేర్కొన్నది. బీఎస్-III పెట్రోల్, బీఎస్-IV డీజిల్ ఫోర్-వీలర్లను నడపడంపై నిషేధం విధించాలని కేంద్రం శుక్రవారం ఆదేశించింది.
స్టేజ్-III కింద, ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుధ్ద్ నగర్‌లలో బీఎస్-III పెట్రోల్ , బీఎస్-IV డీజిల్ ఫోర్-వీలర్ల నిర్వహణపై కూడా ఆంక్షలు విధించారు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పగటిపూట ఒక మోస్తరు పొగమంచు కురుస్తుందని ఐఎండీ అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.